- రక్షణ శాఖ గ్రీన్‌సిగ్నల్
- ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం
అక్కడి ఆస్తులు, అప్పులు జీహెచ్‌ఎంసీకి బదలాయింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లను ఆయా రాష్ట్రాల మున్సిపాలిటీలలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంటోన్మెంట్ వీలీన ప్రక్రియకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో పాటు మరో 8 రాష్ట్రాలలోని కంటోన్మెంట్లు ఆయా ప్రభుత్వ అధీనంలోని మున్సిపాలిటీలలో కలవనున్నాయి.
ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ అధికారులు తరుచూ రహదారులు బంద్ చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని కాలనీలు, నివాసాలతో పాటు ఇతర ప్రాంతాలన్నీ ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయి.
ఆస్తులన్నీ బదలాయింపు
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25 డిఫెన్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ తర్వాత ఈ నెల 27న జరిగిన మరో సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హజరయ్యారు. ఈ సమా వేశంలోనే కంటోన్మెంట్లను ఆయా రాష్ట్రాల మున్సిపాలిటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడి ఆస్తులను ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా అందనున్నాయి. దీంతో ఇక నుంచి కంటోన్మెంట్ ఆస్తులన్నీ జీహెచ్‌ఎంసీకి చెందుతాయి. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అన్ని రకాల ఆస్తులు జీహెచ్‌ఎంసీకే చెందనున్నాయి. అదే విధంగా కంటోన్మెంట్‌కు ఉన్న అప్పుల భారాన్ని కూడా జీహెచ్‌ఎంసీనే తీర్చాల్సి ఉంటుంది. బ్రిటీష్ కాలంలో ఆర్మీ స్థావరాల కోసం ఏర్పాటు కోసం ఈ కంటోన్మెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, స్వాతంత్య్రం అనంతరం నుంచి ఈ ప్రాంతాలు రక్షణ శాఖ ఆధీనంలో ఉంటున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 13 గ్రామాలు, 279 ప్రైవేటు కాలనీలు, 16 సివిల్ ఏరియాలు ఉన్నాయి.
ఇక హల్‘చలే’!
- కొత్తగా 16 హైవేలు!!
- కేంద్రానికి సమర్పించిన రాష్ట్ర సర్కారు
- కొత్త హైవేల పట్ల కేంద్రం సానుకూలత
- రాష్ర్టంలో పెరగనున్న రోడ్ కనెక్టివిటీ
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న హైవేల విస్తరణపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే రాష్ర్టంలో ఉన్న రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలను అందించింది. రాష్ర్ట పరిధిలోని 16 మార్గాలను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేసింది. మొత్తం 1617 కి.మీ.జాతీయ రహదారులను అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ర్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇప్పటికే సమావేశం అయ్యారు.
తెలంగాణలో ఖచ్చితంగా ఈ 16 రహదారులను హైవేలుగా మార్చాలని వారు గడ్కరీకి విన్నవించారు. కేంద్రం సైతం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ రహదారుల నిర్మాణానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రానికి చెందిన ఎన్‌హెచ్ అధికారులు తెలిపారు. కొత్త హైవేలతో రాష్ట్రంలో మరింతగా నెట్వర్క్ పెరిగి రాకపోకలు మరింతగా ఊపందుకుంటాయని, రాష్ట్రంలో అభివృద్ధికి మరింత ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ర్టవ్యాప్తంగా హైవే నెట్వర్క్ పెరిగేందుకు అవకాశం...
ప్రతిపాదిత హైవేల వల్ల రాష్ర్ట పరిధిలోనే కాకుండా కర్ణాటక, ఏపీ, మహారాష్ర్ట, ఛత్తీస్ గడ్, ఒడిషా రాష్ట్రాలకు సైతం అనుసంధానం ఏర్పడుతుందని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకుపోయింది. జగిత్యాల- (130 కి.మీ.), దిండి- (100 కి.మీ.), మరికల్- (63 కి.మీ.), వనపర్తి- (110 కి.మీ.), మన్నెగూడ- (134 కి.మీ.), కరీంనగర్- (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్- (67 కి.మీ.), సారపాక- నాగారం (93 కి.మీ.), జగ్గయ్యపేట- (100 కి.మీ.), భూత్పూర్- (166 కి.మీ.) రహదారులను అప్ గ్రేడ్ చేయడం వల్ల పొరుగు రాష్ట్రాలతో రాకపోకలకు అవకాశాలు మెరుగవుతాయి. ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు కూడా మెరుగైన పరిస్థితులు వస్తాయి.
స్థానికంగా హైవేలు పెరిగేలా...
రాష్ర్టంలో వివిధ జిల్లాల మధ్య కూడా హైవేల నిర్మాణం వల్ల వాటి నిర్వహణ భారం రాష్ర్టం పరిధి నుంచి తప్పించి కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. ఫలితంగా రాష్ర్టంపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు రోడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా ఉంటుంది. వీటిలో భువనగిరి- (44 కి.మీ), చౌటుప్పల్- (182 కి.మీ), దుద్దెడ క్రాస్ రోడ్ (63 కి.మీ), కొత్తపల్లి- (75 కి.మీ), సిరిసిల్ల- (65 కి.మీ), కరీంనగర్ (60 కి.మీ) వంటి రహదారులున్నాయి.
రాష్ర్టంలో హైవేలుగా మారనున్న కీలక మార్గాలు ఇవే..
జగిత్యాల-కాటారం (130 కి.మీ)
జగిత్యాల, ధర్మారం, పెద్దపల్లి, మంథని, కాటారం వరకు కొత్తగా ప్రతిపాదించిన హైవే. ఈ మార్గంలో కరీంగర్- ధర్మపురి మార్గంలో ధర్మారం వద్ద, రాజీవ్ రహదారిపై పెద్ద పల్లి వద్ద కొత్త హైవే కలుస్తుంది. ఈ హైవే ముగిసే కాటారం వద్ద వరంగల్- కాళేశ్వరం రహదారితో అనుసంధానం అవుతుంది. సింగరేణి కాలరీస్ ఉన్న నేపథ్యంలో ఈ హైవే వల్ల బొగ్గు సరఫరాలకు అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటు మహారాష్ర్ట, కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్ గడ్, ఒడిషా చేరుకునేందుకు అవకాశం ఏర్పడుంది.
భూత్పూర్-శ్రీరిగిరిపాడు
(166 కి.మీ)
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న భూత్పూర్ నుంచి నాగర్ కర్నూలు, అచ్చంపేట, అమ్రాబాద్, మద్దిమడుగు వరకు అక్కడి నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా శ్రీరిగిపాడు వరకు కొత్త హైవే నిర్మించనున్నారు. ఈ హైవే వల్ల నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అలాగే కృష్ణానదిపై నూతనంగా వంతెన నిర్మించనున్నారు. ఫలితంగా ఏపీ తెలంగాణ మద్య రాకపోకలకు చక్కని అవకాశం ఏర్పడుతుంది. దుర్గి, మాచర్ల, ఎర్రగొండపాలెం తదితర పట్టణాల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య కృష్ణానది అడ్డుగా ఉన్నందున చుట్టూ తిరిగి వెళ్లేందుకు కనీసం 150 కి.మీ పైగా దూరం ప్రయాణించి చేరుకోవాల్సి వస్తోంది.
దిండి--నల్గొండ (100 కి.మీ)
డిండి నుంచి నల్గొండ ప్రస్తుతం ఆర్ అండ్ బి రోడ్డు మార్గం ఉంది. అయితే జాతీయ రహదారి చేయడం వల్ల రాకపోకలకు మరింత మెరుగైన రోడ్డు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్- కల్వకుర్తి- శ్రీశైలం మార్గంలో డిండి నుంచి ఈ రహదారి ప్రారంభమై హైదరాబాద్- నాగార్జున సాగర్ మార్గంలో దేవరకొండ వద్ద కలుస్తుంది. అచ్చంపేట, కర్నూలు, శ్రీశైలం వైపు నుంచి నల్గొండ వెళ్లేవారికి ఈ మార్గం ద్వారా వెసులుబాటు లభిస్తుంది.
వనపర్తి--మంత్రాలయం
(110 కి.మీ)
వనపర్తి- మంత్రాలయం హైవే ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. వనపర్తి నుంచి కొత్తకోట, అజ్జకొల్లు, ఆరేపల్లి, నదీ అగ్రహారం, గద్వాల, మల్దకల్, అయిజ, ఏపీలోని నాగలదిన్నె, మీదుగా మంత్రాలయం చేరుకునేందుకు ఈ మార్గం అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం మంత్రాలయం వెళ్లేందుకు కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల సుమారు 70 కి.మీ దూరం పెరుగుతోంది. ఈ కొత్త హైవే వల్ల కృష్ణా, తుంగభద్ర నదులపై నూతనంగా బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడే రోడ్డు కావడం వల్ల రవాణ సౌకర్యం సరిగా లేని వెనకబడిన ప్రాంతాలకు ఎంతో వెసులుబాటు ఏర్పడుతుంది.
మన్నెగూడ--బీదర్ (134 కి.మీ)
కొడంగల్- హైదరాబాద్- భూపాలపట్నం జాతీయ రహదారిపై ఉండే మన్నెగూడ నుంచి జహీరాబాద్ మీదుగా కర్ణాటకలోని వరకు నిర్మించే ఈ రహదారి వల్ల వికారాబాద్ జిల్లా నుంచి నేరుగా కర్ణాటకలోని బీదర్ చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
కరీంనగర్--పిట్లం (165 కి.మీ)
కరీంనగర్ నుంచి వేములవాడ, సిరిసిల్లా, కామారెడ్డి, భాన్సువాడ మీదుగా కామారెడ్డి జిల్లా పిట్లం వరకు 165 కి.మీ మేర నిర్మించే ఈ హైవే వల్ల కరీంనగర్ నుంచి కర్ణాటకకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.
ఎర్రవెల్లి క్రాస్-రోడ్-రాయచూర్ (67 కి.మీ)
కశ్మీర్ నుంచి నాగపూర్, హైదరాబాద్, బెంగళూరు మీదుగా కన్యాకుమారి వరకు ఉన్న దేశంలోనే అతిపెద్ద హైవే అయిన ఎన్.హె.44 మీద ఉన్న ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాల మీదుగా కర్ణాటకలోని రాయచూరుకు 67 కి.మీ మేర నిర్మించే హైవే వల్ల తెలంగాణ, కర్ణాటక మధ్య రాకపోకలకు అనుకూలంగా మారుతుంది.
సారపాక--ఏటూరు నాగారం
(93 కి.మీ)
భద్రాచలం నుంచి అశ్వాపురం, మణుగూరు, మీదుగా ఏటూరు నాగారం వరకు ప్రస్తుతం ఉన్న రాష్ర్ట రహదారిని జాతీయ రహదారిగా మార్చనున్నారు. ఫలితంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి రాకపోకలకు చక్కని రహదారి అందుబాటులోకి వస్తుంది. ఛత్తీస్ గడ్, ఒడిషాకు ప్రత్యమ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది.
దుద్దెడ--రాయగిరి క్రాస్‌రోడ్
(63 కి.మీ)
రాజీవ్ రహదారిలో ఉన్న దుద్దెడ నుంచి కొమరవెల్లి, జగదేవ్ పూర్, యాదగిరిగుట్ట మీదుగా హైదరాబాద్- వరంగల్ మార్గంలో ఉన్న రాయిగిరి వద్దకు చేరుకునేందుకు ఈ ప్రతిపాదిత రహదారి అనుకూలంగా ఉంటుంది.
జగ్గయ్యపేట--కొత్తగూడెం
(100 కి.మీ)
ఏపీలోని జగ్గయ్యపేట నుంచి వైరా మీదుగా నేరుగా కొత్తగూడెం వెళ్లేందుకు ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఎంతో సౌలభ్యంగా మారనుంది.
మరికల్--రామసముద్రం
(63 కి.మీ)
మరికల్ నుంచి నారాయణపేట మీదుగా రామసముద్రం వరకు నిర్మించే ఈ హైవే వల్ల కోదాడ- మహబూబ్ నగర్- రాయచూరు- బళ్లారి హైవేలో మరికల్ నుంచి రామసముద్రం వరకు చక్కని రహదారి అందుబాటులోకి వచ్చి వెనకబడిన ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.