24-04-2025 08:51:35 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో నూనె గింజల సాగును ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) అన్నారు. గురువారం నూనె గింజల మిషన్ జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 2025-26 ఆర్థిక సంవత్సరంలో నూనె గింజలు అయినటువంటి వేరుశనగ, సన్ఫ్లవర్, నువ్వులు తదితర సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచి అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూనె గింజల సాగును పెంచడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందన్నారు.నూనె గింజల సాగును ఇతర పంటల సాగుతో మార్పిడి చేయటం ద్వారా భూమి సారవంతం చేయవచ్చు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఇతర పంటలతో పోలిస్తే నూనె గింజల సాగులో నీరు, ఎరువులు వాడటం తక్కువ మోతాదులో ఉంటుంద ని దీని ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చు అన్నారు. నూనె గింజల సాగు వ్యయం తక్కువ ఉండటంతో పాటు, చీడ పీడల బెడద తక్కువగా ఉంటుందని కాబట్టి నూనె గింజల సాగు అన్నదాతలకు అన్ని విధాలుగా లాభదాయకమని, పంటల మార్పిడి కింద అందరూ ఈ పంటలు సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్ బాబు, కెవికె శాస్త్రవేత్త నారాయణమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.