calender_icon.png 26 March, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాశమెలారంలో చమురు దందా

26-03-2025 01:25:39 AM

అదనపు ఆదాయానికి ఆశపడి వక్రమార్గంలో డ్రైవర్లు ఆయిల్ ట్యాంకర్ల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న మాఫియా ఒక లీటర్‌కు గరిష్ఠంగా రూ.55 చొప్పున చెల్లింపు రోజుకు 20 వేల లీటర్ల మేర సేకరణ మార్కెట్‌లో ఆ ఆయిల్ విలువ అక్షరాలా రూ.10 లక్షలు నిద్రావస్థలో విజిలెన్స్, పోలీస్‌శాఖలు అది సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడ. 65వ జాతీయ రహదారికి కూత వేటు దూరంలో ఉంటుందీ ప్రాంతం.

అక్కడ ఓ పదో.. పన్నెండో తాత్కాలిక రేకుల షెడ్లు దర్శనమిస్తాయి. షెడ్ల బయట వందల సంఖ్యలో ఐరన్ డ్రమ్ములు కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఎవరికైనా అక్కడ ఏదో పరిశ్రమ నడుస్తుందని అనిపిస్తుంది. కానీ.. అది వాస్తవం కాదు. అక్కడ జరిగేది ముడి చమురు ఆయిల్ దందా. 

అదనపు ఆదాయానికి ఆశపడి కొందరు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు అక్రమ మార్గంలో మాఫియాకు కొంత ముడిచమురు అమ్ముతున్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో రోజుకు దాదాపు రూ.10లక్షల మేర ఇలా సంపాదిస్తున్నారు. పదేళ్ల నుంచి ఈ దందా సాగుతున్నప్పటికీ.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్‌శాఖలు చూసీచూడ నట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

 సంగారెడ్డి, మార్చి 25 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని 65వ జాతీయ రహదారి సమీపంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో పదేళ్ల నుంచి చమురు మాఫి యా దందా కొనసాగుతున్నది. అక్రమార్కులు మ హారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే ముడి చమురు ట్యాంకర్లను ట్యాంపరింగ్ చేసి అక్రమంగా ఆయిల్ దండుకుంటున్నారు.

ముడి చమురు సేకరించి నిల్వ చేసేందు కు షెడ్లు వేయడం, అవసరమైన సరంజామా సమకూర్చుకోవడం, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించ డాన్ని చూస్తే దందా ఎంత వ్యవస్థీకృతంగా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దందా నడిపిం చేందుకు లోకల్ వ్యక్తులను నియమిస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన మాఫియా.. బతుకుదెరువుకు ఉత్తరాది నుంచి వచ్చిన వారిని నియమి స్తున్నదని తెలిసింది. వారికి చాలా తక్కువ జీతం ఇచ్చి ఊడి గం చేసుకుంటున్నదని సమాచారం.

దందా స్టుల్ ఇలా..

65వ జాతీయ రహదారి మీదుగా ప్రతిరోజూ వందల కొద్దీ ఆయిల్ ట్యాంకర్లు వెళ్తుంటాయి. వాటిని నడిపే డ్రైవర్లతో ముందే మాఫియా బేరం మాట్లాడుతుంది. ‘పెద్ద సముద్రంలో బక్కెట్ నీళ్లు తీస్తే ఏమతుంది ?’ అన్న చందంగా డ్రైవర్లు దందాలోకి దిగుతారు. ఒక్కో ట్యాంకర్ తక్కువలో తక్కు 25 వేల లీటర్ల ముడి చమురును తరలించగలదు.

జాతీయ రహదారి మీదుగా వెళ్లే సమయంలో ఆయిల్ ట్యాంకర్లను మార్గమధ్యంలోని ఓ చోట నిలిపేస్తారు. వెంటనే మాఫియాకు చెందిన మనుషులు రంగంలోకి దిగుతారు. చకచకా ట్యాంకర్ వద్దకు వచ్చి ట్యాంపరింగ్ చేస్తారు. యాజమాన్యాలకు డ్రైవర్లకు అనుమానం రాకుండా ఒక్కో ట్యాంక ర్ నుంచి కొద్ది కొద్ది మొత్తంలో చమురు సేకరిస్తా రు. సేకరించిన ఆయిల్‌ను ఐరన్ డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు.

ఇలా రోజుకు 30 నుంచి 50 ఆయిల్ ట్యాంకర్ల నుంచి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే 20 వేల లీటర్ల ముడి చమురు సేకరిస్తారని సమాచారం. చమురును దొడ్డిదారిన ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు, ఫర్నీచర్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ పరిశ్రమలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ముడి చమురును రిఫైన్ చేస్తే మరిన్ని బై ప్రోడక్ట్స్ (ఉప ఉత్పత్తులు) వస్తాయని, వాటిని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటారని సమాచారం. 

జీపీఎస్‌కు చిక్కకుండా.. చాలా తెలివిగా..

ఇవాళ రేపు వాహన యజమానులు ప్రతి వాహనానికి జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. తద్వా రా తమ వాహనం ఏ సమయంలో.. ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి వెళ్తున్నది.. ఏ ప్రాంతంలో ఆగింది అన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. కానీ.. ఆయిల్ ట్యాంకర్లు నడిపే డ్రైవర్లు ఈ విషయాన్ని చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.

హైవే పక్కనే ఉండే ధాబా సమీప ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. రోడ్డు పక్కనే వాహనం ఆగుతుంది కాబట్టే యాజమాన్యాలకు అనుమానం వచ్చే అవకాశమే లేదు. జీపీఎస్ నుంచి హైవే పక్కనే బండి ఆగినట్లు యజమానికి సమాచారం వెళ్తుంది. అక్రమార్కుల నుంచి ట్యాంకర్ డ్రైవర్లు ఒక్కో లీటర్ ముడి చమురుకు గరిష్ఠంగా రూ.55 వరకు వసూ లు చేస్తున్నారని తెలిసింది.

ఈ చొప్పున 10 లీటర్లు ట్యాంపరింగ్ చేస్తే డ్రైవర్‌కు రూ.550 అదనపు ఆదాయం అన్నమాట. అలా  50 లీటర్లు అప్పగిస్తే రూ.2,750 దండుకోవచ్చు. ఇంతా జరుగుతున్నా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్‌శాఖలు దందాను చాలా ‘మామూలు’గా తీసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.