27-03-2025 12:51:14 AM
వ్యవసాయ విస్తీర్ణ అధికారి నాగార్జున
సిద్దిపేట మార్చి 26 (విజయక్రాంతి): ఆయిల్ ఫామ్ టోటల్ సాగుచేసిన రైతులు వేసవికాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని తొగుట మండలం వ్యవసాయ విస్తీర్ణ అధికారి నాగార్జున సూచించారు. బుధవారం మండలంలోని పెద్ద మాసన్ పల్లి తదితర గ్రామాలలో పర్యటించిన తోటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయిల్ పామ్ మొక్కలు 2 నుంచి 4సంవత్సరాలు వయస్సులోపు ఉన్నాయని, ఎండల నుండి ఆయిల్ పామ్ తోటలను సంరక్షించుకోవడానికి రైతులు నీటి యాజమాన్యం పై దృష్టి సారించాలని చెప్పారు. మొవ్వు దగ్గర రెండు కంటే ఎక్కువ మట్టలు విచ్చుకోకపోతే ఆ మొక్క నీటి ఎద్దడికి గురి అయినట్లుగా గుర్తించాలన్నారు.
ఆ మొక్కలకి వెంటనే నీళ్లను అందించాలని తెలిపారు. వేసవిలో 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల మొక్కలకి సుమారు రోజుకి 300 లీటర్ల నీళ్లు అవసరం ఉంటుందని,సాధారణంగా బిందు సేద్యం గంటకు 80 లీటర్ల నీటిని విడుదల చేస్తుందని దాంతో ఉదయం, సాయంత్రం 2 గంటల చొప్పున రోజుకు 5 గంటలు వరకు నీటిని అందించాలన్నారు.
బిందు సేద్యం ద్వారా నీటిని అందించేటప్పుడు మొక్క మొదలు నుంచి ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల వ్యాసార్థంలో నీటిని అందించాలన్నారు. మల్చింగ్ నేలలో ఉన్న నీరు ఆవిరి కాకుండా ఉండడానికి పాదులలో మల్చింగ్ ఏర్పాటు చేసుకోవాలని, పాదు ఒక మీటర్ వ్యాసార్థం వరకు ఏర్పాటు చేసుకొని వరి గడ్డితో కప్పి ఉంచుకోవాలి లేదా ఈ పాదులలో జనుము లేదా జీలుగా చల్లుకొని ఏపుగా పెరిగిన తర్వాత మొక్కల ను కోసి అదే పాదుళ్లలోనే కప్పి ఉంచాలన్నారు. ఎరువులు వేసేటప్పుడు తేమ ఎక్కడైతే ఉందో అక్కడ వేసుకున్నట్లయితేనే ఎరువులు నీటి లో కరిగిపోయి పోషకాలు మొక్కలకు అందుతాయని తెలిపారు.