calender_icon.png 22 January, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలయన్స్‌కు ఆయిల్ బిజినెస్ దెబ్బ

20-07-2024 01:15:51 AM

  • రూ.15,138 కోట్లకు తగ్గిన నికరలాభం 
  • ఆదాయం రూ.2.36 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలోకెల్లా శ్రీమంతుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) క్యూ1 ఆర్థిక ఫలితాలపై ఆయిల్, కెమికల్ వ్యాపారం ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. దీంతో 2024 ఏప్రిల్ త్రైమాసికంలో ఆర్‌ఐఎల్ నికరలాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్ల వద్ద నిలిచింది. రిఫైనింగ్ మార్జిన్లు తగ్గడం, పెట్రో కెమికల్స్, రిఫైనింగ్ ప్లాంట్ల అధిక తరుగుదల వ్యయాలు కంపెనీ లాభాల్ని కుదించాయి.

గత ఏడాది ఇదేకాలంలో ఆర్‌ఐఎల్ రూ. 16,011 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇక 2024 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే స్వీక్వెన్షియల్‌గా నికరలాభం రూ.18,951 కోట్ల నుంచి 20 శాతం క్షీణతను చవిచూసింది. తాజా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మాత్రం 12 శాతం వృద్ధిచెంది  రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.36 లక్షల కోట్లకు చేరింది. ఆయిల్ అండ్ గ్యాస్ విభాగంలో అధిక ఉత్పత్తుల ధరలు, క్రూడ్ ధరల కారణంగా ఆదాయం పెరిగింది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఆదాయం ఉన్నప్పటికీ, నికరలాభం మాత్రం అంచనాల్ని అందుకోలే కపోయింది. క్యూ1లో రూ.16,340 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేశారు.

ఈ తొలి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఇబిటా 2 శాతం వృద్ధిచెంది రూ.42,748 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు మాత్రం 150 బేసిస్ పాయింట్ల మేర తగ్గి 16.6 శాతానికి దిగిపోయాయి. తరుగుదల వ్యయాలు 15 శాతం పెరిగి రూ.13,596 కోట్లకు చేరాయి. అధిక వడ్డీ రేట్లు నడుస్తున్నందున కంపెనీ వడ్డీ వ్యయాలు సైతం రూ.5,918 కోట్లకు చేరాయి. 

జియో లాభంలో 12 శాతం వృద్ధి

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ అయిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నికరలాభం జూన్ త్రైమాసికంలో 12 శాతం వృద్ధిచెంది రూ.5,445 కోట్లకు చేరింది. నిరుడు క్యూ౧లో రూ.4,863 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదాయం 10 శాతం పెరిగి రూ.24,042 కోట్ల నుంచి రూ. 26,478 కోట్లకు చేరింది. స్వీకెన్షియల్‌గా నికరలాభం 2 శాతం వృద్ధిచెందింది. ఈ తొలి త్రైమాసికంలో కొత్తగా 80 లక్షలమంది చందాదా రుల్ని పెంచుకున్నట్టు జియో తెలిపింది. ఏపీఆర్‌యూ (ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్) రూ.181.7గా నమోదయ్యింది. తమ కొత్త ప్రిపెయిడ్ ప్లాన్స్ 5జీ, ఏఐలపై పరిశ్రమ నవకల్పనలకు దోహదపడతాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. 

రిలయన్స్ రిటైల్ లాభం రూ.2,549 కోట్లు

ఆర్‌ఐఎల్ రిటైల్ వ్యాపారం జూన్ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని కనపర్చింది. రిలయన్స్ రిటైల్ ఆదాయం 8.1 శాతం వృద్ధితో రూ.75,615 కోట్లకు చేరింది. నికరలాభం 5 శాతం వృద్ధిచెంది రూ.2,549 కోట్లకు పెరిగింది. ఇబిటా 10 శాతం పెరిగి రూ.5,664 కోట్లకు చేరింది. ఈ ఏప్రిల్ మధ్యకాంలో రిలయన్స్ రిటైల్ కొత్తగా 331 స్టోర్లను ప్రారంభించింది. దీనితో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 18,918 వద్దకు చేరింది. 81.3 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో ఈ స్టోర్లు నెలకొన్నాయి.

ఈ త్రైమాసికంలో తమ స్టోర్లను 296 మిలియన్ల మంది సందర్శించారని, గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగారని రిలయన్స్ రిటైల్ తెలిపింది. జియోమార్ట్ డిజిటల్ వ్యాపారం 14 శాతం వృద్ధిచెందిందని పేర్కొంది. తమ రిటైల్ వ్యాపారం క్రమేపీ వృద్ధిచెందడం వినియోగదార్ల పట్ల తమ కమిట్‌మెంట్‌ను సూచిస్తున్నదని రిలయన్స్ రిటైల్ వెంచర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు.