calender_icon.png 23 February, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహా ఏమి రుచి!

23-02-2025 12:14:43 AM

పాలకోవ అంటేనే ప్రతిఒక్కరికీ ఇష్టం. కానీ గద్వాల జిల్లా బొంకూర్ పాలకొవ రుచే వేరు. యంత్రాలతో కాకుండా కట్టెల పొయ్యి మీద తయారు చేయడమే దీని ప్రత్యేకత. ఇక్కడి పాలకోవ కేవలం గద్వాల్‌లోనే కాకుండా రాయలసీమ, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. 

స్వచ్ఛమైన పాలకోవ అంటేనే బొంకూర్ పాలకోవ అని టక్కున గుర్తుకువస్తుంది. అయితే ఈ పాలకోవను తయారుచేసేది ఎవరో కాదు..  ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాసీం బాషా, రసూల్ బాషా, షాలీ బాషా, రజాక్ బాషా అన్నదమ్ముళ్లు. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూర్ గ్రామంలో 60 ఏండ్లుగా నివసిస్తున్నారు. దాదాపుగా 60 ఏండ్లు పాలకొవను తయారు చేస్తూ బతుకుతున్నారు.

తాతల కాలం నుంచే ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తెలంగాణలో చాలా చోట్ల పాలకోవ అందుబాటులో ఉన్నప్పటికీ బొంకూర్ పాలకోవ రుచి ఎక్కడా దొరకదు. ‘పాలల్లో నీళ్లు కలిపితే పాలకొవ నాణ్యత తగ్గుతుందని ఉద్దేశంతో ఉదయాన్నే స్థానిక రైతుల వద్దకు పాలు సేకరిస్తాం. నిర్ణీత ఉష్ణోగత్రలో పాలను వేడి చేసి, గంట పాటు మరిగించిన తర్వాత అందులో చక్కెరను కలిపి పాలకోవను తయారుచేస్తాం’ అని చెబుతున్నారు వీళ్లు. 

20 ఏండ్లుగా తయారు చేస్తున్నాం 

మా అత్తమామలు, నా భర్త నుంచి పాలకొవ తయారీ నేర్చుకున్నా. ఇరవై ఏళ్లుగా కట్టెల పొయ్యి మీద పాలకొవను తయారు చేస్తున్నా. యంత్రాలతో తయారయ్యే పాలకోవ కంటే కట్టెలపొయ్యి మీద చేసిన పాలకోవకే రుచి ఎక్కువ.  మా కుటుంబాలన్నీ ఈ పనిపై ఆధారపడే బతుకుతున్నాయి.

ఫాతిమా, బొంకూర్ గ్రామం.