calender_icon.png 14 November, 2024 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో పులి!

12-11-2024 01:22:17 AM

  1. నిర్మల్ జిల్లా మామడ మండలంలో పులి సంచారం
  2. పొలానికి వెళ్లేందుకు జంకుతున్న తండావాసులు

నిర్మల్, నవంబర్ 05 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పులి సంచారంతో ప్రజలు జంకుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నిర్మల్ జాతీయ రహదారిపై మహబూబ్ ఘాట్ వద్ద పులి వెళ్తుండగా అటవీశాఖ అధికారులు గుర్తించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. మామడ మండలంలోని గాదిగూడ తండా మెండిగుట్ట ప్రాంతంలో సోమవారం పులి కనిపించింది.

తండాకు చెందిన లక్ష్మి సోమవారం పొలానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో పులి గాండ్రింపు వినపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వారంతా అక్కడికి చేరుకునే సరికే పులి అడవిలోకి వెళ్లింది. దీంతో గ్రామస్థులు అటవీ అధికారులకు  సమాచారం ఇవ్వగా వారు ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించి పులి అడుగులుగా గుర్తించారు. దీంతో తండావాసులు భయపడి పొలానికి వెళ్లాలంటే జంకుతున్నారు. పులి జాడను గుర్తించేందుకు అధికారులు 4 బృందాలుగా విడిపోయి అడవిలో గాలిస్తున్నారు. 

కాసిపేట అడవుల్లో పెద్దపులి.. 

బెల్లంపల్లి, నవంబర్ 11: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పెద్దపులి సంచరిస్తున్నది. కాసిపేట మండలంలోని పెద్దధర్మారం, గురువాపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించడంతో ప్రజలు భయపడుతున్నారు. నాలుగు రోజుల కిందట కాసిపేట అటవీప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా..

ముత్యంపల్లి అటవీప్రాంతంలో మేకలపై చిరుత దాడి చేసింది. గురువాపూర్ ప్రాంతంలో పెద్దపులి కదలికలున్నట్లు అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పెద్దపులి గాండ్రిపు వినిపిస్తుందని గురువాపూర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అటవీప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను అడవిలోకి వెళ్లొద్దని, పత్తి చేలలో పనిచేసే రైతులు శబ్దాలు చేస్తూ పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు.