calender_icon.png 12 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ నారీ రత్నమా, గడియ తీయవమ్మా!

25-12-2024 12:04:19 AM

తిరుప్పావై సిరినోము-10 

నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం

తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో

ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే

తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్ (తమిళ)

గోదా గోవింద గీతం

నోములెన్నొనోచి కృష్ణసంస్పర్శస్వర్గాన తేలుతున్నావా

తలుపు తెరవకున్న పోనిమ్ము పలుకైన పలుకవేమి

కిరీటి, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు

పల్లాండు పాడిన పరవశించు పరమానందమూర్తి 

పఱై నిచ్చి పర తత్త్వజ్ఞానమ్ముకూడా బోధించువాడు

రామబాణహతుడు కుంభకర్ణుడు నిద్రలో నీచేత ఓడెనా

నారీ రత్నమా మత్తులో తొట్రు పడక నెమ్మదిగ 

గడియ తీయరమ్ము, నోముకై మా తోడ కలిసి రమ్ము. (తెలుగు)

నోట్రు= నోము నోచి, సువర్గమ్ పుగుగిన్ఱ= స్వర్గాన్ని ప్రవేశిస్తున్నం త సుఖాన్ని ఎడతెగక అనుభవిస్తున్న, అమ్మనాయ్= అమ్మా, వాశల్= వాకిలి తలుపు, తిఱవాదార్= తీయని వారు, మాట్రముమ్ తారారో= ఒక బదులు మాటైనా మాట్లాడరా, నాట్రత్తుఝాయ్ ముడి= పరిమళాలు గుబాళిస్తున్న తులసీమాలతో అలంకృత కిరీటముగ ల, నారాయణన్= నారాయణుడు అనే దివ్యనామాంకితుడు, నమ్మాల్= మనతో, పోట్ర= పల్లాండును, పాడించి, ప్పఱైతరుమ్= మనకు ప్రాయమైన కైంకర్యాన్ని, పఱైని= అనుగ్రహిం చే వాడు, పుణ్డియనాల్= పుణ్య స్వరూపుడైన శ్రీమహావిష్ణువుతో, పండు ఒరునాళ్= ముం దొక కాలంలో, కూట్రత్తిన్ వాయ్ వీఝన్ద= యుముని నోట్లో పడిన, కుంబకరణనుమ్= కుంభకర్ణుడును, ఉనక్కే తొట్రు= నీకు ఇచ్చి వెళ్లాడా, ఆట్ర ఆనందలుడైయాయ్= గాఢమై న నిద్రను కలిగిన దానా, అరుంగలమే= దుర్లభమైన ఆభరణమా, తేట్రమాయ్ వందు= నిద్రమత్తును వదిలించుకొని వచ్చి, తిఱ= తలుపు తీయి.

శ్రీ కృష్ణానుభవం, శ్రీ కృష్ణ సంశ్లేషమే, స్నా నం. ఆయనే ధ్యానం. ఆయనే నిద్ర, సర్వస్వం కూడా. అటువంటి విశేషమైన గోపికను, అం దరూ ఒకటే అనీ, భూమిమీద నివసించే వా రంతా కలిసి ఉండాలని, మంచితనం పెంపొందించుకోవాలని, అందరినీ కలుపుకుని పోవా లని, అందరూ భగవద్గుణానుభవాన్ని పొం దాలని గోదాదేవి అభిలషిస్తూ ఈ వ్రతాన్ని రూపొందించారు.  నోము నోచి హాయిగా నిద్రిస్తున్న అమ్మా, వాకిలి తలుపు తీయకపోతే పోయే కనీసం మాటైనా మాట్లాడకూడదా ?

కిరీటంలో తులసిమాలను ధరించి నారాయణ దివ్యనామంతో భాసిల్లేవాడు, మనకు పల్లాండు పాడే అవకాశం కల్పించి మనకు పఱైని లేదా పరాన్ని అనుగ్రహించే వాడు, ధ ర్మం మూర్తీభవించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు, అతని చేతిలో పడి యముని జేరిన కుంభకర్ణుడు అంతకు ముందే నీతో ఓడిపోయి తన గాఢనిద్రను నీకు ఇచ్చాడా ఏమి? సొగసుగా నిదురించే దానా, దొరకని ఆభరణమా, నిద్రమత్తు వదిలించుకుని తలుపు తెరువమ్మా.

శ్రీకృష్ణుడిని చేరి ఆయన ఇస్తానన్న వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపు తూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తున్నది గోద. ఈమె అంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ అని తెలిసి జ్ఞానంతో కూడిన భక్తి కలిగిన ఈమె ఇంటికి  చేరుకుని సుప్రభాతం పాడి తమతో రమ్మంటున్నారు.  ఏవమ్మా మాతో చేరి నోము నోచుదామని చెప్పి, నీవు ముందే వ్రతం ముగించి శ్రీ కృష్ణానుభవమనే స్వర్గాన్ని అనుభవిస్తున్నావా?

నీతో కలిసి జీవించడమే స్వర్గం, విడిచి ఉండడమే నరకం అని రాముని గురించి చెప్పింది. గోపికలకు కూడా స్వర్గమంటే శ్రీకృష్ణానుభవమే. ఆ అనుభవంలో లీనమైన వారికి స్వర్గం లెక్కలోకి రాదు. వీళ్ల దృష్టిలో వ్రతమంటే శ్రీకృష్ణుడే తమకు ఉపాయమనుకుని ఎదమీద చేయి వేసుకుని హాయిగా నిదురించడమే. ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూ పు దాల్చి వచ్చిందే శ్రీకృష్ణావతారం.

ఆయనలో సకలం ఉన్నట్లే కదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. ‘ఎవరైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతారో వారికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు’ అని గోదమ్మ అన్నారట (త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి వివరణ ఆధారంగా). భగవంతుడి నిజ స్వరూపం తెలుసుకున్నారంటే అన్ని నోములూ నోచుకున్నట్టే. 

అన్నమయ్య సంస్కృత కీర్తనలో “శరణు శరణు విభీషణ వరదా... దారుణ కుంభకర్ణదనుజ శిరచ్ఛేదక.. వీరప్రతాపరామ విజయాభిరామ వాలినిగ్రహ సుగ్రీవ రాజ్యస్థాపక” అని గోదమ్మ కూడా ఈ విధంగా రాముని గురించి పాశురంలో వివరించిందా? 

-మాడభూషి శ్రీధర్