విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రలు పోషించడం ద్వారా నటనలో తన వైవిధ్యత చూపించబోతున్నారు. ఈ చిత్రంతో ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘సోను మోడల్’ వీడియో సాంగ్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘ఆ జా సోనూ భాయ్..’ అంటూ ప్రారంభమయ్యే ఈ పాట.. విశ్వక్సేన్ పాత్ర ‘సోను మోడల్’ను పరిచయం చేస్తోంది.
లియోన్ జేమ్స్ సమకూర్చిన ట్యూన్ ఆకట్టుకునే బీట్‌లతో మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాటకు విశ్వక్సేన్ స్వయంగా లిరిక్స్ రాయడం విశేషం. ఈ పాటను నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ పాడారు. వాలంటైన్ డే కానుకగా 2025, ఫిబ్రవరి 14న విడుదల కానుందీ సినిమా.