- భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- మెదక్ జిల్లాలో 3-5 డిగ్రీల తగ్గుదల
- ఇబ్బంది పడుతున్న చిన్నారులు, వృద్ధులు
హైదరాబాద్/సంగారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి పంజా విసురుతుండడంతో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిళ్లు బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మెదక్ జిల్లాలో చలి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పడిపోతుండగా.. మెదక్‌లో మాత్రం 3-5 డిగ్రీలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 18 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయని.. వారం పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
కోహీర్‌లో 9.5 డిగ్రీలకు..
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, కోహీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. శుక్రవారం రాత్రి కోహీర్‌లో 9.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయ ంత్రం 5 నుంచి ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది.
ఈ సందర్భంగా విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలి చెవులకు తగలకుండా మఫ్లర్, మంకీక్యాప్.. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్ని దుస్తువులు ధరించాలని సూచిస్తున్నారు.