దేశ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం
13 ఏళ్ల పాటు వివాదాలతో వేలానికి దూరం
ప్రపంచంలో కీలక దేశాల సరసన భారత్
బ్లాక్స్ వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): దేశంలో మొట్టమొదటిసారి ఆఫ్ షోర్ ఏరియా మినరల్ బ్లాక్స్ వేలంతో దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆఫ్‌షోర్ మినరల్స్ బ్లాక్స్ వేలం కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆఫ్ షోర్ మినరల్ డెవలప్‌మెంట్ యాక్ట్ 2010వ సంవత్సరంలో వినియోగంలోకి తీసుకొచ్చారని, కానీ ఆ తర్వాత 13 ఏళ్లపాటు లిటిగేషన్లు, ఇతర సమస్యల కారణంగా వేలం జరగలేదని తెలిపారు. దేశంలో 21 లక్షల ఎకరాల ఆఫ్ షోర్ మినరల్ కెపాసిటీని ఎక్స్‌ప్లోర్ చేశామని తెలిపారు. దీని ద్వారా వికసిత్ భారత దిశగా మైనింగ్ రంగం మరింత పురోగతి సాధించనుందని పేర్కొన్నారు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఆఫ్ షోర్ మైనింగ్‌లో ఉన్నాయని, ఇప్పుడు మన దేశం కూడా ఈ జాబితాలో చేరిందన్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్ మెంట్స్, ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ పెరిగిందని, తదనుగుణంగా ఇందులో వినియోగించే లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర క్రిటికల్ మినరల్స్‌కు డిమాండ్ పెరగుతుందని చెప్పారు.
2030 నాటికి లక్షకోట్లకు..
2030 నాటికి ఆఫ్ షోర్ మినరల్స్ మార్కెట్ దాదాపు లక్షకోట్లకు చేరనుందన్నారు. మనం వివిధ క్రిటికల్ మినరల్స్‌ను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటున్నామని, ఇది దేశానికి ఓ సవాల్, ఓ అద్భుతమైన అవకాశం కూడా అని తెలిపారు. పీఎస్‌యూ కాబిల్ ద్వారా విదేశాల్లోని క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్ యాక్టివిటీని ప్రారంభించాయన్నారు. అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్స్ తీసుకుని ఎక్స్‌ప్లొరేషన్ చేస్తున్నామని తెలిపారు.క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రకటించిన ఐదు నెలల్లోనే ఈ దిశగా తాము కీలకమైన ముందడుగేశామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఈ దిశగా మరిన్ని ట్రాంచెస్‌లో వేలం వేయనున్నామని మంత్రి వివరించారు. పీఎస్‌యూలతోపాటు ప్రైవేట్ సంస్థలను భాగస్వాములు చేసి ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామన్నాని చెప్పారు. పారదర్శకంగా మినరల్ బ్లాక్స్ వేలం కారణంగా రాష్ట్రాల రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగిందదన్నారు. 2004 వరకు రాష్ట్రాల రెవెన్యూ రూ.60 వేల కోట్లుంటే.. 2025 వరకు ఇది రూ.2.54 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దాదాపు నాలుగు రెట్లు రెవెన్యూ రాష్ట్రాలకు పెరిగిందని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.