calender_icon.png 22 September, 2024 | 3:12 AM

అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా

22-09-2024 01:01:20 AM

కోకాపేటలో 8 నిర్మాణాలు నేలమట్టం

  1. బాధితుల ఆగ్రహం  

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 21: అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో ఎనిమిది నిర్మాణాలను నేలమట్టం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం.. కోకాపేట సర్వేనంబర్ 147లో కొంత ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు నిర్మాణాలు చేపట్టారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జేసీబీల సాయంతో శనివారం 8 నిర్మాణాలను నేలమట్టం చేశారు. అది ప్రభుత్వ భూమి అని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా నార్సింగి మున్సిపల్ పరిధిలో అనుమ తులకు మించి నిర్మాణం చేపట్టిన మరో భారీ భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. జీ+2 అనుమతులు తీసుకొని జీ+5 నిర్మాణం చేపట్టడంతో కూల్చివేశారు.  

బాధితుల ఆవేదన.. 

కాగా, నిర్మాణాల కూల్చివేతపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, అందులోనే నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. తాము ఇంటి నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు కూడా తీసుకున్నామన్నారు. తమ ఇళ్ల పక్కన పెద్ద పెద్ద భవంతులు వెలిసినా పట్టించుకోకుండా కేవలం పేదలపైనే అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కుషాయిగూడలో.. 

కాప్రా: కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలోని ప్రధాన రహదారిపై వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం తొలగించారు. జీహెచ్‌ఎంసీ ఈస్ట్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు కుషాయిగూడ ప్రధాన రహదారి, మార్కెట్ ఆవరణలోని ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తున్న దుకాణాలను తొలగించారు.