calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం

12-04-2025 12:30:19 AM

కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత

పటాన్ చెరు, ఏప్రిల్ 11 :అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై రెవె న్యూ   అధికారులు శుక్రవారం ఉక్కుపాదం మోపారు.  ము న్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో 164 సర్వేనెంబర్, పటేల్ గూడా 12 సర్వే నెంబర్, సుల్తాన్ పూర్ పరిధిలోని 30 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా  నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం జేసీబీతో కూల్చివేశారు.

మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విజయక్రాంతి దినపత్రిక ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ఈనెల 2న ’ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు’ అనే శీర్షికన, 10వ తేదీన ’కబ్జాదారులకు అడ్డాగా అమీన్ పూర్’ అనే శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై జిల్లా అధికారులు స్పందించారు.  నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అమీన్ పూర్ తహసిల్దార్ వెంకటస్వామి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి మూడు చోట్ల చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. 

ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఆర్‌ఐలు రఘునాథ్ రెడ్డి, శ్రీమాన్ రాజు  పాల్గొన్నారు. అల్లీనగర్ లో కూల్చివేతలు...; గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని అల్లీనగర్ సర్వేనెంబర్ 27 లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన కథనాలతో తహసీల్దార్ బిక్షపతి ఆదేశాల మేరకు ఆర్‌ఐ జయప్రకాష్ నారాయణ శుక్రవారం జేసీబీలతో నిర్మాణాలను  కూల్చివేయించారు.