calender_icon.png 1 November, 2024 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండాలె

01-09-2024 01:09:21 AM

  1. తక్షణ సహాయ చర్యలు చేపట్టండి
  2. సీఎస్, డీజీపీకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  3. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం
  4. బడులకు సెలవుల నిర్ణయం కలెక్టర్లదే: సీఎస్

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సీఎం  మాట్లాడారు. రాష్ర్టవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తితే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

కంట్రోల్ రూమ్‌లు తెరవాలె..

 సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులను ప్రకటించుకునే నిర్ణయం ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతా ల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, సచివాలయంలో కంట్రోల్ రూమ్‌లను తెరవాలని ఆదేశించారు. ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని పేర్కొన్నారు.  ముందస్తు సమా చారమిస్తే ఈ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఉన్నతాధికారులు దాన కిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, క్రిస్టినా జెడ్ చోంగ్తు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.