- పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్
- వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు, ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోవాలని సూచించారు.