calender_icon.png 20 April, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు పెట్టారు.. అక్రమార్కులు తొలగించారు

28-03-2025 12:15:29 AM

  • అక్రమార్కుల చెరలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి
  • సివిల్ రైట్ ప్రొటక్షన్ ఆర్గనైజేషన్ ఫిర్యాదుతో వెలుగులోకి
  • ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డులను పాతిన రెవెన్యూ అధికారులు
  • మరుసటి రోజే బోర్డులను మాయం చేసిన అక్రమార్కులు

ఇబ్రహీంపట్నం, మార్చి 27 (విజయ క్రాంతి): ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో.. ఇది ప్రభుత్వ భూమి అంటూ రెవె న్యూ అధికారులు ఈ నెల 24న ఏర్పాటు చేసిన బోర్డులను, జేబీ వెంచర్, గురునానక్ కళాశాలలో అక్రమార్కులు ఒక్క రోజులోనే మాయం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ సర్వే నెం.80లో 33 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో 60 మందికి ఇవ్వగా వారు అమ్ముకున్నారు.

దీనిని గ్యాప్ ఏరియా కింద చూపిన భూములను రియల్ వ్యాపారులు కొనుగోలు చేసి ఏకంగా హెచ్‌ఎండీఏ, పంచాయతీ వెంచర్లు చేశారు. కాగా దీనిపై  సివిల్ రైట్ ప్రొటక్షన్ ఆర్గనైజేషన్ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ లు జేబీ రియల్ ఎస్టేట్ సంస్థలో సుమారు 12 ఎకరాలు, గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో 5 ఎకరాలకు పైగా ఆక్రమించినట్లు గుర్తించారు.

మిగతాది రియల్ వ్యాపారులు అంతా కలిసి సర్వే నెం.80 అసైన్డ్ భూమికి 67 పట్టా నంబర్ తో రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించి, ఇది ప్రభుత్వ భూమి అంటూ మొత్తం 8 బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ మరుసటి రోజే అక్రమార్కులు బోర్డులను తొలగించించారు. ప్రస్తుతం అందులో 2 మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ వారు స్పందించకపోవడం, స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ.200 కోట్ల విలువ ఉంటుంది. అయితే బడా వ్యాపారవేత్తల చేర నుండి ప్రభుత్వ భూమిని పూర్తిస్థాయిలో అధికారులు స్వాధీనం చేసుకుని కాపాడుతారా..? లేక, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా అన్నది వేచి చూడాల్సిందే..

ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే చర్యలు.. సునీత, ఇబ్రహీంపట్నం తహసీల్దార్

ప్రభుత్వ భూమినీ గ్యాప్ ఏరియాగా చూపుతూ కొన్ని అక్ర మ నిర్మాణాలకు జరిగింది వాస్తవమే. ఇక నుంచి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులకు లేఖ రాస్తాం. అదేవిధంగా జేబీ వెంచర్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకు ఆక్రమించిన ప్రభుత్వ భూమి విషయంపై ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకొంటాం.