29-04-2025 07:03:18 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరంలో మే 15 నుండి 26 వరకు సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అన్నారు. మంగళవారం విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం ఏర్పాటు, టెంట్ సిటి ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, జాయ్ రైడ్, సత్రం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో పనులు పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ డబ్ల్యూఎస్, పీఆర్, రవాణా, వైద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విఐపి ఘాట్ వద్ద టెంట్ సిటీ, ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు, స్టాళ్లు, కిడ్స్ జోన్ తదితర ఏర్పాటు చేయుటకు మార్కింగ్ చేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు. విఐపి ఘాట్ వెళ్ళు రహదారి నిర్మాణానికి మార్కింగ్ చేయాలన్నారు. జాయ్ రైడ్ చేసేందుకు కౌంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సమయం లేదని పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
ప్రత్యేక ఘాట్లు, తాత్కాలిక వసతి కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఈ పుష్కరాలలో ప్రత్యేకంగా ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు స్టేజి ఏర్పాట్లు, విద్యుద్దీకరణ చేయాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి విద్యుద్దీకరణ చేయాలని సూచించారు. విధులు నిర్వహించే సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కింగ్, ఆర్టీసీ ప్రదేశాల్లో సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్ళడానికి అనువుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయజక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, దేవాదాయ శాఖ ఎస్ ఈ కనక దుర్గా ప్రసాద్, డిపిఓ నారాయణ రావు, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధు సూదన్, ఇరిగేషన్, పంచాయతి రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈలు తిరుపతి రావు, వెంకటేశ్వర్లు, నళిని, ఆబ్కారీ ఈఎస్ శ్రీనివాస్, కాటారం డిఎస్పీ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.