జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ (DCDC) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.. పశుసంవర్ధక శాఖ అధికారులు కేవలం పశువులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం, వాటి సంఖ్య నమోదు చేయడం మాత్రమే కాకుండా పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో గ్రామంలో ఎన్ని పశువులు ఉన్నవి పాడి పరిశ్రమలు నెలకొల్పితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. అజోల్ల పెంపకం, పశుగ్రాసం పెంపకంపై దృష్టి సారించి వృద్ధి చేయడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. డిసిసిబి, నాబార్డ్ వారి సహకారంతో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
మత్స్యశాఖ అధికారులు ఆసక్తిగల మహిళలకు చేపల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, నాబార్డ్ ద్వారా చేపల పెంపకం యూనిట్ల స్థాపనకు రుణ సహాయం అందించవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న పండించే ప్రాంతాల్లో మొక్కజొన్న ఆకుల ద్వారా దానా తయారీ పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు చేపల పెంపకం, దానా తయారీ పరిశ్రమలపై అవగాహన కల్పించాలని అన్నారు. డిసిసిబి, నాబార్డ్ తమ పరిధిలో నూతన ఆలోచనలను పెంపొందించడంతో పాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుల క్రింద పత్తి విత్తనాల నుండి ఆయిల్ సేకరణ పరిశ్రమ, చేపల దాన తయారీ పరిశ్రమ, పాడి పరిశ్రమ, కమ్యూనిటీ పశువుల షెడ్ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు జిల్లాలో 150 చేపల పెంపకం యూనిట్ లో స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా సహకార శాఖ అధికారి ఖుర్షీద్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్ (నాబార్డ్), సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.