20-03-2025 05:06:53 PM
యాసంగి పంటకు నీటి విడుదలపై అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో ఎస్సారెస్పీ క్రింద యాసంగి పంట పోలాలు నీటి సరఫరా కోరకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ శ్రీహర్ష డీ-83 కాల్వ క్రింద యాసంగి పంటకు నీటి విడుదలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ కాల్వ క్రింద యాసంగి పంట కింద 7 తడులలో 6 తడుల నీటిని ఇప్పటికే విడుదల చేయడం జరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడం, ఎస్సారెస్పీ నుంచి ఆశించిన స్థాయిలో నీరు విడుదల కాకపోవడం, ఎండ తీవ్రత వల్ల ఆవిరిలో కొంత నీరు నష్టపోవడం వంటి కారణాల వల్ల చివరి ఆయ కట్టు ప్రాంతాల్లో పంట పొలాలకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదని అన్నారు.
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ఎస్సారెస్పీ కాల్వలపై ఎక్కడా నీటి వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాల్వలపై అవసరమైన చోట తగు చర్యలు తీసుకుంటూ నీటిని విడుదల చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సంబంధిత అధికారులను తెలుసుకొని వారికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, మంథని ఈఈ బాల రామయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.