ఉడిపి హోటల్ సీజ్ చేసిన అధికారులు
జగిత్యాల, (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన జగిత్యాల తహసిల్ చౌరస్తాలో ఉడిపి హోటల్‌లో ఓ మహిళ ఇడ్లీ ఆర్డర్ చేసి తినే సమయంలో జెర్రీ కనిపించడం నిర్వాహకుల తీరుపై ఆగ్రహం, ఆందోళన వ్యక్తం నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇది ఆరోగ్యానికి హానికరం అంటూ హోటల్ ఎదుట బైఠాయించారు. ఈ సంఘటన స్థానిక ప్రజలను కలవరానికి గురి చేయడంతో పాటు హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఆదివారం ఉదయం పది గంటలకు ఒక మహిళ తన కుటుంబంతో గణేష్ భవన్ ఉడిపి హోటల్‌కు వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేసింది. ఆమె తన చిన్నపిల్లలకు ఆహారం అందించే ప్రయత్నంలో ఇడ్లీలో జెర్రీ కనిపించింది.
ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆమె హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యం వలన తమ కుటుంబం ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిందని ఆమె ఆరోపించింది. చిన్నపిల్లలు ఉన్నారు. వారు తింటే పరిస్థితి ఏమిటి?" అంటూ హోటల్ యజమాన్యాన్ని నిలదీసింది. మహిళ నిరసన చేయడంతో హోటల్ యజమాని ఆమెకు ఏదో సమాధానం ఇవ్వాలని ప్రయత్నించాడు. మొదట, జెర్రీ కాదని, అది కేవలం నల్ల దారం అని చెప్పిన యజమాని, తన మాటలకు కట్టుబడి ఉండలేక, ఇడ్లీనోట్లో వేసుకోవడాని కూడా ప్రయత్నించాడు. జెర్రీ అని నిర్ధారించుకున్న తరువాత, హోటల్ యజమాని ఆ ఇడ్లీని ఉమ్మివేశాడు. దీంతో అప్పటికే గుమికూడిన వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బాధితురాలు హోటల్ ముందు నేరుగా నిరసన వ్యక్తం చేసింది. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మహిళ రోడ్డుపై బైఠాయించి, యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చట్టపరం గా కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.
హోటల్ యాజమాన్యం ఇడ్లీలను మున్సిపల్ ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, బాధితురాలు ఇతర ప్రజలు అడ్డుకున్నారు. ఇడ్లీలను రోడ్డు మీదే పారవేసి, ప్రజారోగ్య పరిరక్షణకు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత పాటించక ప్రజలన అనారోగ్యం పాలు చేస్తున్నారని, క్వాలిటీ నియంత్రణ లేకపోవడంతో నిర్వాహకులు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈఘటనపై జగిత్యాల జనం తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యశాఖ, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ శాఖ అధికారులు, హోటల్‌ను పరిశీలించి, ఆహార నాణ్యత ప్రమాణాలు విఫలం అయ్యారని నిర్ధారించారు.
ఆ మహిళ ఫిర్యాదుతో, హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఆహార, ఆరోగ్య అధికారుల సహకారంతో, హోటల్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో హోటల్ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుకుంటున్న హోటళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి సంఘటన జరుగకుండా అడపాదడపా హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతకు తిలోకాలిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని కోరగా, హోటల్ నిర్వాహకులను సంబంధిత శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు.