calender_icon.png 22 October, 2024 | 5:13 AM

సోయా రైతుకు అధికారుల ద్రోహం?

22-10-2024 12:32:33 AM

  1. ఆన్‌లైన్‌లో నమోదుకాని సోయా పంట వివరాలు
  2. వివరాలు లేక కొనుగోళ్లకు నిరాకరణ
  3. ఏఈవోల నిర్వాకంతో అన్నదాతకు నష్టం

నిర్మల్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రైతులకు దన్నుగా నిలిచే వ్యవసాయ శాఖ అధికారులు వారిని నిండా ముంచారు. ప్రతి సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఏఈవోలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

నిర్మల్ జిల్లాలో సోయా పంట వివరాలను ఏఈవోలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో రైతుల నుంచి పంటను కొనేందుకు కేంద్రాల్లో నిరాకరిస్తున్నారు. దీంతో దళాలరులకు తక్కువ ధరకు అమ్ముతూ రైతులు నష్టపోతున్నారు. 

లక్ష ఎకరాల్లో సోయ 

నిర్మల్ జిల్లాలో పత్తి తర్వాత సోయ పం టనే అధికంగా సాగు చేస్తున్నారు. జిల్లాలోని కుంటాల, కుబీర్, తానూర్, లోకేశ్వరం, దిలువార్‌పూర్, నర్సాపూర్, సోన్ భైంసా, ముధో ల్, బాసర ప్రాంతాల్లో వానకాలంలో సుమా రు లక్ష ఎకరాల్లో సోయాను సాగు చేశారు. జూన్‌లో సాగు చేసిన పంట ఇప్పుడు చేతికొచ్చింది.

పంటను అమ్ముకునేందుకు రైతు లు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ద్వారా జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. కుంటాల, కుబీర్, తానూర్, సారంగపూర్ ముదోల్, భైంసాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నారు. సోయా పంటకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.4,892 మద్దతు ధరను ప్రకటించింది. 

రైతులు చెప్పినా నమోదుకాలే..

రైతులు సాగు చేసిన పంటల వివరాలు క్షేత్రస్థాయిలో ఏఈవోలు పరిశీలించి, రైతు పేరు, సర్వేనంబరు, పంట విస్తీర్ణం తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని వ్యవసాయ కస్టర్ల పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల సాగు వివరాలు క్షేత్రస్థాయి లో పరిశీలన చేయకుండా నామమాత్రంగా నమోదు చేశారు.

జిల్లాలో 79 వ్యవసాయ కస్టర్లు ఉండగా ఒక్కో క్లస్టర్ పరిధిలో ఐదువేల ఎకరాల్లో సోయా పంట సాగయింది. పంటల సర్వేకు వచ్చిన అధికారులకు రైతు లు వివరాలు తెలిపినప్పటికీ వారు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని రైతులు ఆరోపి స్తున్నారు. తమ పంట వివరాలు వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారనే నమ్మకంతో రైతులు చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు.

అక్క డ అధికారులు పంటల వివరాలు ఆన్‌లైన్ లో లేకపోవడంతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను రైతు లు సంప్రదిస్తే వారు దాటవేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏఈవోల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రభుత్వ మద్దతు ధర కు పంటను అమ్ముకోలేకపోతున్నారు. క్వింటాలుకు రూ.4,892 మద్దతు ధర ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులకు రూ.300 తగ్గించి అమ్ముతున్నారు. దీనికి తోడు తేమ, నాణ్యత పేరుతో క్వింటాలుకు 2  కిలోలు ఎక్కువగా తూకం వేయించుకుంటున్నారు.

నిబంధనల పేరుతో కొర్రీలు

ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ప్రభుత్వ నిబంధనలు శాపం గా మారుతున్నాయి. సోయా పంటను అసలే ఆలస్యంగా ప్రారంభించిన ప్రభు త్వం కొనుగోళ్లలో రైతులకు కొర్రీలు పెడుతున్నది. రైతులు సాగు చేసిన పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనాల్సి ఉన్నా ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే కొనేలా నిబంధన పెట్టింది.

ఈసారి సోయ పంటకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడులు పెరిగింది. గత ఏడాది ఎకరాని కి కేవలం 4, 5 క్వింటాళ్ల దిగుబడి రాగా ప్రస్తుతం 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నట్టు రైతులు తెలిపారు. ప్రభుత్వం మాత్రం 6 క్వింటాళ్లకు పరిమితం చేయడంతో మిగిలిన రెండు క్వింటాళ్లు ప్రైవే టు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముతూ నష్టపోతున్నారు. 10 క్వింటా ళ్ల వరకు ప్రభుత్వం కొనాలని రైతులు కోరుతున్నారు.