calender_icon.png 15 November, 2024 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులకు సర్వే ఫికర్!

15-11-2024 12:19:16 AM

  1. నెలాఖరులోపు పూర్తికి ప్రభుత్వం డెడ్‌లైన్ 
  2. సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లకు ఇళ్ల తాళాలు స్వాగతం
  3. గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ
  4. సర్వే ఫార్మాట్‌లో వివరాలు చేప్పేందుకు పలువురు విముఖత
  5. కులగణన సర్వేలో ఎన్యూమరేటర్ల అవస్థలు

మహబూబ్‌నగర్/రంగారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సామాజిక సర్వేలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు అవస్థలు పడుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ డెడ్‌లైన్ విధించడంతో అధికార యంత్రాంగం పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

మండల, జిల్లా కార్యాలయాల్లోని పలు విభాగాల్లో అధికారులు అధిక శాతం సర్వే భాద్యతల్లో ఉన్నా రు. అయితే పట్టణాల్లో సర్వేకు ఇళ్ల యజమానులు అందుబాటులో ఉంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అందుబాటులో ఉండ టం లేదు. సర్వే కోసం వెళ్లే సిబ్బందికి మధ్యాహ్న సమయంలో ఇళ్ల తాళాలు స్వాగ తం పలుకుతున్నాయి.

ప్రస్తుతం పంటలు కోతల సమయం కావడంతో గ్రామాల్లో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇంకొందరు శుభకార్యాల యాల్లో తలమునకలయ్యారు.దీంతో ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్యూమరేటర్లకు చిన్న కుటుంబ సర్వే వివరాలు పూర్తి చేసేందుకు తక్కువ సమయం పడుతుండగా పెద్ద కుటుంబాలకు 30 నిమిషాల సమయం పడుతుం ది. 

కార్యాలయాల చుట్టూ జనం 

సర్వేలో అధికారులు నిమగ్నం కావడం తో కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం ఆఫీసుల కు వెళ్లిన ప్రజలు పనులు పూర్తికాక ఇబ్బంది పడుతున్నారు. అధిక శాతం అధికారులు సర్వేలో ఉండటంతో కార్యాలయానికి వెళ్లే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉం డక వెనుతిరుగుతున్నారు. సర్వే పూర్తి అయితేనే కార్యాలయల్లో అధికారులు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉందని కార్యాలయాల్లోని సిబ్బంది చెబుతున్నారు. 

వివరాలు చేప్పేందుకు విముఖత

సర్వేలో కొందరు ఆధార్, పట్టదారు పాసుపుస్తకాలు, పాన్ వివరాలు చేప్పేందుకు విముఖత చూపుతున్నారు. ఎన్యూ మరేటర్లు కూడా వారు చెప్పిన వివరాలనే నమోదు చేసుకుని మిగతావి వదిలే స్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. గతంలోనే అన్ని వివరాలు ఇచ్చాం మళ్లీ ఎందుకు వివరాలు అడగుతున్నారంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారు.

మరికొందరు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. ఆస్తులు, అప్పు లు, వాహనాల వివరాలు వెల్లడించడంలేదు. ఇద్దరు భార్యలున్న వారు, సహజీ వనం చేస్తున్న వారు వివరాలు చెప్పడం లేదు. సర్వేలో పొలిటికల్ వివరాలు ఉండటంతో కొన్ని చోట్ల పార్టీల వివరాలు చెప్పడం లేదు. 

సర్వేపై అధికారుల తనిఖీలు

సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. సర్వేలో ఎన్యూమరేటర్ల కు ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకుని, వారికి ఉన్న సందేహాలను అధికా రులు నివృత్తి చేస్తున్నారు. సర్వే ఫారంలో కొట్టివేతలు లేకుండా కుటుంబ సమగ్ర వివరాలు, కులాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని సూచిస్తున్నారు.

మండల స్థాయిలో ఎంపీడీవో, మున్సిపల్, కార్పొరేషన్లనో కమిషనర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ జిల్లాస్థాయి అధికారులు సర్వే వివరాలను ఆరాతీస్తున్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎన్యూమరేటర్లకు అధికారులు సూచనలు చేస్తున్నారు.