05-04-2025 12:00:00 AM
సబ్సిడీ గొర్రెల పథకంలో అధికారులు, సిబ్బంది చేతివాటం
5 యూనిట్లు హాం ఫట్
ఆర్‌టీఐ దరఖాస్తుతో ‘అక్రమాలు’ వెలుగులోకి
తీగ లాగితే కదిలిన ‘అవినీతి’ డొంక
అవినీతి అధికారుల మెడకు బిగుసుకోనున్న ఉచ్చు
బెల్లంపల్లి, ఏప్రిల్ 4 : బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసు పాలైంది. అర్హులకు దక్కాల్సిన గొర్రెలను బినామీలకు కట్టబెట్టి పశుసంవర్ధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు తెరలేపడం బెల్లంపల్లి మండలంలో పెద్ద దుమారం లేపుతుంది. పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ పథకంలో పెద్ద ఎత్తున తమ చేతివాటాన్ని ప్రదర్శించడంతో అర్హులకు తీరని అన్యాయం జరిగింది. అసలైన లబ్ధిదారులకు దక్కాల్సిన గొర్రెలు బినామీలకు మంజూరయ్యాయి.
లబ్ధిదారులకు కాకుండా బినామీలకు గొర్రెలను కట్టబెట్టి అప్పటి పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది చిక్కుల్లో చిక్కుకున్నారు ఉపాధి కోసం ప్రభుత్వం నుండి రుణాన్ని పొందాలని, సబ్సిడీ గొర్రెల పెంపకం పథకానికి చం ద్రవెల్లి గ్రామానికి చెందిన యాదవ యువకుడు దరఖాస్తు చేసుకోవడంతో గొర్రెల పథకంలో చోటు చేసుకున్న ’అవినీతి’ తతంగం బట్టబయలైంది.
తన పేరిట మరొక వ్యక్తికి అధికారులు గొర్రెలు కేటాయించారని తెలిసి సదరు బాధిత యువకుడు నిర్గాంతపోవాల్సి వచ్చింది. అధికారు ల తీరుతో అనుమానం వచ్చిన యువకుడు ఆర్టిఐ ని ఆశ్రయించాల్సి వచ్చింది. పూర్తి సమాచారాన్ని పొందేందుకు ఆర్టిఐ కి దరఖాస్తు చేయడంతో గొర్రెల పథకంలో అక్రమాల తతంగం నడిపిన దళారులంతా ఈ విష యం బయటకు పోకుండా భేరసారాలు నడుపుతున్నట్లు తెలుస్తుంది. తీగలాగితే అధికారుల డొంక కదులుతోంది.
ప్రభుత్వ ఆశయానికి తూట్లు
నిరుపేదలైన గొల్ల కుర్మలకు గత ప్రభు త్వం సబ్సిడీ కింద గొర్రెల పెంపకం యూని ట్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. ఇంతటి సదాశయానికి అవినీతి అధికారులు తూట్లు పొడిచారు. అర్హులైన గొల్ల కుర్మ లను పారదర్శకంగా ఎంపిక చేసి వారికి సబ్సిడీ రుణం కింద రూ లక్ష రూపాయల గొర్రెల యూనిట్ మంజూరు చేయాల్సి ఉంది. బెల్లంపల్లి మండలంలో 72 గొర్రెల యూని ట్లు ప్రభుత్వం మంజూరు చేయగా ఇందు లో అధికారులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డ ట్లు బహిర్గతమైంది. రికార్డు లో అర్హుల పేర్లు నమోదు చేసి బినామీలకు 5 యూనిట్ల గొర్రెలను కట్టబెట్టి అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు.
ఇది జరిగింది...
బెల్లంపల్లి మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన కొమ్ము మల్లేష్ యాదవ్ అనే యువకుడు గొర్రెల యూనిట్‌కి దరఖాస్తు చేశాడు. అయితే పశుసంవర్ధక శాఖ అధికారులు అంతకుముందే అతని పేరిట బినామీ వ్యక్తికి గొర్రెలు యూనిట్ మంజూ రు చేశారు. ఇందుకు సంబంధించిన నిధులను చెక్కు రూపంలో అందజేసినట్లు కూడా చెప్పడంతో అసలు లబ్ధిదారుడైన మల్లేష్ ఒక్కసారి కంగుతిన్నారు. తనకు సబ్సిడీ గొర్రెల యూనిట్ ఇప్పటికీ మంజూరు కాలేదని ఆవేదన చెందారు. అధికారులు చేతి వాటం ప్రదర్శించి తనకు దక్కాల్సిన గొర్రెల యూనిట్ బినామీకి కట్టబెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో అవినీతి అధికారులు
గుట్టు చప్పుడు కాకుండా సబ్సిడీ గొర్రెల పథకంలో జరిగిన అక్రమాలను అసలు లబ్ధిదారులు ఆర్‌టీఐ ద్వారా బయటికి తీయడం తో అవినీతికి పాల్పడ్డ పశుసంవర్ధక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తన కు మంజూరు చేయాల్సిన సబ్సిడీ గొర్రెల యూనిట్లు బినామీ పేరిట మరొకరికి ఎలా మంజూరు చేశారని లబ్ధిదారుడు కొమ్ము మల్లేష్ నిలదీయడంతో ఇప్పుడు చేసేదేమీ లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలంలో ఎన్ని గొర్రెల యూనిట్లు మంజూరు చేశారు? ఎంతమంది లబ్ధిదారులకు అందించారు? సమాచారం ఇవ్వాలని ప్రస్తుతం బెల్లంపల్లి మండలంలో పనిచేస్తున్న పశు వైద్య అధికారికి ఆర్టిఐ ద్వారా సమాచారం పెట్టడంతో గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారుడితో కాళ్ల బేరానికి దిగుతున్నారు.
విషయం బయటకు పొక్కితే తమ ఉద్యోగాలు కోల్పోవడం తో పాటు తమపై క్రిమినల్ కేసులు అవుతాయన్న భయంతో వణికి పోతున్నారు. ఈ వ్యవహారంపై పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఒక అధికారిని సంప్రదించగా ఒకే ఇంటి పేరుతో ఉండి సొసైటీ చూపిన వారికి అప్పటి అధికారులు గొర్రెల యూనిట్లను మంజూరు చేసి ఉంటారు తప్పా ,డబ్బులు పొంది బినామీలకు సబ్సిడీ గొర్రెల యూని ట్లు మంజూరు చేశారనడం లో నిజం లేదన్నారు. దీనిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికా రులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
అధికారులు, సిబ్బందే అసలు సూత్రధారులు
సబ్సిడీ గొర్రెల యూనిట్ ట్ పంపిణీలో జరిగిన అక్రమాలలో 2017 2018 సంవత్సరాల్లో పనిచేసిన పశు వైద్య అధికారులు, సిబ్బందే అసలు సూత్రధారులుగా స్పష్టమౌతుంది. అధికారులు సిబ్బం ది కలిసి ఈ అక్రమాలకు తెరలేపారని తెలుస్తుంది. అసలు లబ్ధిదారులను కాకుండా బినామీలకు గొర్రెల యూ నిట్లు కట్టబెట్టి చేతి వాటాన్ని ప్రదర్శించి ఐదు యూనిట్ల గొర్రెలను హాం ఫట్ అనిపించారు. మండలానికి మం జూరైన 72 గొర్రెల యూనిట్లలో అధికారులు ఇష్టం వచ్చినట్లు బినామీలకు కట్టబెట్టినట్లు బాధితులు బాహాటంగా చర్చించుకుంటున్నారు.