calender_icon.png 17 October, 2024 | 6:55 PM

హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ జోరు

27-09-2024 12:00:00 AM

కొలియర్స్ నివేదిక :

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ఒకవైపు ఐటీ కంపెనీల వర్క్ ఫ్రం హోం ముగియడం, మరోవైపు కొత్త కార్యాలయాల ఏర్పాటు, షాపింగ్ మాల్స్ నుంచి డిమాండ్ పెరగడం తదితర అంశాలతో హైదరాబాద్ నగరంలో ఆఫీస్ లీజింగ్ జోరుగా సాగుతున్నది. ఈ ఏడాది జూలై త్రైమాసికంలో నిరుడు ఇదేకాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు 16 శాతం డిమాండ్ పెరిగింది. రియల్టీ కన్సల్టెన్సీ కొలియర్స్ తాజా నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో సగం బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే.

ఈ జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్‌లో 29 లక్షల చదరపు అడుగుల స్థలాల్ని, ఆవరణల్ని కార్యాలయాలు అద్దెకు తీసుకున్నాయి. గత ఏడాది ఇదేకాలంలో 21 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదయ్యింది. దేశంలో లీజింగ్ జరిగిన ఆఫీస్ స్పేస్‌లో నాల్గవ వంతు టెక్నాలజీ రంగానిదేనని కొలియర్స్ తెలిపింది. తదుపరి బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు) రంగం అధికంగా ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై నగరాల్లో ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లోనే గత 2023 మొత్తం డిమాండ్‌ను మించిందని కొలియర్స్ పేర్కొంది. 

కొలియర్స్ నివేదిక వివరాలు..

  1. జూలై దేశంలోని 6 ప్రధాన నగరాల్లో స్థూల ఆఫీస్ లీజింగ్ 31 శాతం పెరిగి 132 లక్షల చదరపు అడుగుల నుంచి 173 చదరపు అడుగులకు చేరింది.
  2. దేశంలో జరిగిన లీజింగ్‌లో సగభాగం బెంగళూరు, హైదరాబాద్‌ల్లోనే నమోదయ్యింది.
  3. బెంగళూరులో గతంలో ఏ త్రైమాసికంలోనూ లేనంతగా 85 శాతం వృద్ధితో 34 లక్షల చదరపు అడుగుల నుంచి 63 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెకు వెళ్ళింది. 
  4. పూనేలో స్థూల లీజింగ్ 10 లక్షల చదరపు అడుగుల నుంచి 26 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.
  5. ముంబై (27 లక్షల చదరపు అడుగులు) చెన్నై (14 లక్షల చదరపు అడుగులు) నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధి నమోదుకాలేదు. 
  6. ఢిల్లీ ఎన్సీఆర్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ 32 లక్షల చదరపు అడుగుల నుంచి 24 లక్షల చదరపు అడుగులకు తగ్గింది. 

పెరిగిన ఇండ్ల ధరలు..

తగ్గిన అమ్మకాలు : అనరాక్ రిపోర్ట్

ఇండ్ల ధరలు పెరుగుదల ప్రభావం వాటి అమ్మకాలపై పడుతున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ తాజా నివేదిక వెల్లడిస్తున్నది. ఈ జూలై త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన  నగరాల్లో  ఇండ్ల అమ్మకాలు గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 11 శాతం తగ్గి 1.20 లక్షల యూనిట్ల నుంచి 1.07 లక్షల యూనిట్లకు చేరినట్టు అనరాక్ గురువారం తెలిపింది. మరోవైపు ఇండ్ల సగటు ధరలు 23 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇండ్ల అమ్మకాలు క్షీణించాయని అనరాక్ చైర్మన్ అనూజ్ పురి చెప్పారు.

అలాగే రియల్టీ మార్కెట్లోకి కొత్త ఇండ్ల సరఫరా 19 శాతం తగ్గి 1,16,220 యూనిట్ల నుంచి 93,750 యూనిట్లకు చేరినట్లు తెలిపారు. అధిక ధరలు, రుతుపవనాల కారణంగా అమ్మకాలు తగ్గాయన్నారు. మరోవైపు నిర్మాణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు సగటున 23 శాతం పెరిగాయని, చదరపు అడు గు ధర రూ. 6,800 నుంచి రూ.8,390కి చేరినట్టు అనరాక్ తెలిపింది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఇండ్ల ధరలు 32 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

నగరం ఇండ్ల అమ్మకాలు 

  (జూలై-సెప్టెంబర్)

   2024   2023

ముంబై 

మెట్రోపాలిటిన్ 36,190 38,505

పూణె 19,050 22,885

ఢిల్లీ ఎన్సీఆర్ 15,570 15,865

బెంగళూరు 15,025 26,395

హైదరాబాద్ 12,735 16,375

కోల్‌కతా 3,980 5,320

చెన్నై 4,510 4,945