04-04-2025 11:13:54 PM
పసుపు కొట్టే కార్యక్రమానికి తరలివచ్చిన మహిళలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రేపు జరగనున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అంకురార్పణ పసుపు కొట్టే కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ, మహాభిషేకం అలంకరణ , అర్చన బాలబోగ నివేదన తీర్థ ప్రసాదములు భక్తులకు అందజేశారు .అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంకురార్పణ పసుపు కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి శాంతి హోమం , మహా సుదర్శన హోమం ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణమాచార్యులు , వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆలయం పరిసరాలు రామనామ స్మరణ తో మారు మోగింది. రాత్రి 9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈసారి స్వామివారి కల్యాణానికి ఆలయం ఆవరణ నాలుగు కూడలి నందు విద్యుత్ అలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ,గ్రామ పెద్దలు గ్రామస్తులు,భక్తులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.