calender_icon.png 28 October, 2024 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో ఒడువని వలస పంచాయితీ

12-08-2024 12:15:38 AM

  1. అధికార పార్టీలో సద్దుమణగని పాత, కొత్త లొల్లి 
  2. వలస ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేని పాత క్యాడర్
  3. ఎమ్మెల్యేల హాల్‌చల్‌తో జీర్ణించుకోని ఓడిన అభ్యర్థులు 
  4. ఎన్నికలు, పదవుల పంపకాల్లో సమస్యలు తప్పవంటున్న పార్టీ వర్గాలు
  5. తిరిగి సొంత గూటివైపు ఎమ్మెల్యేల చూపు 
  6. దిద్దుబాటు చర్యలకు దిగిన పార్టీ అధిష్ఠానం
  7. బుజ్జగింపులతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో పాత, కొత్త పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్  నాయకత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరత, సభలో ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం అనివార్యంగా మారిందని చెబుతున్నారు. త్వరలోనే మరికొందరు కూడా  కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే బీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో.. పోటీపడి  ఓటమి చెందిన కాంగ్రెస్ నాయకులకు, పార్టీకి చెందిన పాత క్యాడర్‌కు పొసగడం లేదు. దీంతో హస్తం గూటికి వచ్చిన 10 ఎమ్మెల్యేల్లో  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. అంతేకాకుండా పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలను నేరవేర్చడం లేదని, అందుకే సొంతగూటికి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారనే టాక్ కూడా బలంగా వినిపించింది.

వెంటనే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమై పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో చర్చించారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని, స్థానికంగా పాత నాయకులతో ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ బుజ్జగింపులు, విందు రాజకీయాలు నడిపించారు. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లడమే కాకుండా బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయాలనే లక్ష్యం నేరవేరడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పరిమితిలో నియమించే నామినేటెడ్, పార్టీ పదవుల అంశానికి వచ్చేసరికి పాత, కొత్త నాయకుల మధ్య వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

అంతర్గత పోరు

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో  ఓటమి చెందిన సరితాయాదవ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు వీరిద్దరు బీఆర్‌ఎస్‌లోనే ఉండటమే కాకుండా సరితా జడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన సరితా.. గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గట్టి పోటీనే ఇచ్చారు. కృష్ణమోహన్‌రెడ్డి చేరికను సరితా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఉమ్మడి కరీంనగర్‌లో జగిత్యాల నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో జీవన్‌రెడ్డి పోటీ పడి ఓటమి చెందారు.

వీరిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యం మొదటి నుంచి కొనసాగుతోంది. అయితే జీవన్‌రెడ్డికి తెలియకుండానే సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారనే వివాదం నడవడటం, ఆ పంచాయితీ ఢిల్లీ వరకు వెళ్లడంతో జీవన్‌రెడ్డిని అధిష్ఠానం  బుజ్జగించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి భీమ్ భరత్ పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో రెండు వందల పైచిలకు ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌కు రావడం, భీం భరత్‌కు మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి పని చేసిన తనకు వచ్చే ఎన్నికల్లో మొండి చెయ్యి చూపిస్తుందా? అనే భయం నెలకొన్నది.  

తాత్కాలిక పరిష్కారాలు..

వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరికను గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఇందిరాతో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కడియం శ్రీహరి టీడీపీ, బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు తమపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బుజ్జగింపులతో తాక్కాలికంగా వివాదం సద్దుమణిగినా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పదవుల విషయం వచ్చేసరికి నేతల మధ్య విభేదాలు భగ్గుమంటాయనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ చేరికను మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య వ్యతిరేకించగా ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చి తాత్కాలికంగా వివాదం సద్దుమణిగించారు.

మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందిన కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు, పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న బాలరాజు, అజయ్‌కుమార్ కూడా నియోజకవర్గంలో కొత్తగా చేరిన నాయకులతో కలిసి పనిచేయడం లేదు. రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. ఇక్కడ పార్టీని బలోపేతానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కాంగ్రెస్ కండువా కప్పడమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి బరిలోకి దింపిన విషయం తెలిసిందే. దానం నాగేందర్ చేరికను మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డి వ్యతిరేకించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా పనిచేసిన విజయారెడ్డి.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేరికను స్థానిక నేతలు వ్యతిరేకించగా ఆ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రంగంలోకి దిగారు. భవిష్యత్తులో అందరికీ అవకాశాలుంటాయని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా వివాదం ముగిసింది. ఈ అలకల విషయంలో పార్టీ ఎలా ముందుకుపోతుందో వేచి చూడాల్సి ఉంది.