20-03-2025 12:25:23 AM
మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్, రాజమౌళి కలయికలో తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలేర్పడ్డాయి.
ఈ సినిమాలో ప్రియంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో భాగమైన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లోని సెట్స్‌లో పూర్తి చేసిన చిత్రబృందం సెకండ్ షెడ్యూల్ కోసం ఇటీవల ఒడిశా వెళ్లి అక్కడి కోరాపుట్ జిల్లా అడవుల్లో చిత్రీకరణ జరిపారు.
15 రోజులపాటు అక్కడి సిమిలిగుడకు సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డా తదితర ప్రాంతాల్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే, మంగళ వారం రాత్రితో ఒడిశా షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజమౌ ళితోపాటు మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాలతో స్థానిక అటవీశాఖ అధికారులు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
అంతేకాకుండా షూటింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రియాంక చోప్రా మళ్లీ అమెరికాకు వెళ్లిపోయినట్టు ఆమె తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆధారంగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనున్నట్టు సమాచారం.
సెట్‌లో కొత్త రూల్..
మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఒరిస్సా కోరాపూట్ షూట్ లొకేషన్ నుంచి వీడియో లీక్ అవడంతో రాజమౌళి మరింత అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కఠినమైన రూల్స్ పెట్టిన రాజమౌళి ఇప్పుడు మరింత స్ట్రిక్ట్‌గా ముందుకు వెళుతున్నారు.
ప్రస్తుతం ఆంక్షలు మరింత తీవ్రతరం చేశారని సమాచారం. ఇప్పటి వరకూ నటీన టుల నుంచి ఎవ్వరి ఫోన్లనూ సెట్‌లోకి ఆయన అనుమతించడం లేదన్న సంగతి తెలిసిందే. సెట్‌లోకి అడుగు పెట్టేవారెవరైనా ఫోన్ నిర్దేశిత స్థలంలో పెట్టి రావాల్సిందేనట. ప్రస్తుతం రాజమౌళి లీకుల నేపథ్యంలో మరో కొత్త రూల్‌ని పాస్ చేశారట.
ఇక మీదట నటీనటుల వ్యక్తిగత స్టాఫ్ ఒకరిద్దరికి మించడానికి లేదంటూ రూల్ పెట్టారట. మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారికి ఒక్కొక్కరికీ దాదాపు 10 మంది వరకూ వ్యక్తిగత స్టాఫ్ నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరికీ ఇద్దరు వ్యక్తిగత స్టాఫ్ వరకే అనుమతి ఇచ్చారట జక్కన్న.