calender_icon.png 16 April, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాక్షరి మంత్రానికి ప్రేతాత్మకు మధ్య యుద్ధమే ఓదెల2

15-04-2025 12:00:00 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘ఓదెల 2’. ప్రముఖ ఫిలిం మేకర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్‌తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై డీ మధు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ సందర్భంగా సంపత్ నంది విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై, చిత్ర విశేషాలను పంచుకున్నారు. “మొదటి భాగంలో దుష్ట శక్తి అంతమవుతుంది. దాని ఆత్మను నాశనం చేయాలంటే మరో శక్తి కావాలి. అది శివశక్తి లాంటి క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుందనిపించింది.

ప్రేతాత్మకు పంచాక్షరీ మంత్రానికి మధ్య యుద్ధమే మా సినిమా. అంటే ఆత్మ వర్సెస్ పరమాత్మ అన్నమాట. నేను శివశక్తులను మా ఊరు ఓదెల మల్లన్న ఆలయంలో, చుట్టుపక్కల గ్రామాల్లో చూశా. మా నాన్నమ్మ కూడా శివశక్తే. శివసత్తులు నాగసాధువులుగా మారతారని, శివాలయాలను పునరుద్ధరణ చేస్తారని తెలుసుకున్నా. అది స్క్రీన్‌కు కొత్తగా ఉంటుందని భావించా. తమన్నా నాగసాధు గెటప్ కోసం -మొదట మూడు లుక్స్ ట్రై చేశాం. ఆమె చాలా ఫెయిర్‌గా ఉంటారు. నాగసాధులు ఎండల్లో ఉంటారు. ఆ స్కిన్‌టోన్ వేరుగా ఉంటుంది.

ఎన్ని మేకప్‌లు ట్రై చేసినా ఫేక్‌గా అనిపించేది. తమన్నా ఎండలో ఉంటే పింకిష్‌గా మారతారు. అందుకే అసలు మేకప్ లేకుండానే చేద్దామని నిర్ణయించుకున్నాం. నేను రిఫరెన్స్‌గా తీసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ డిజైనర్ నేతలుల్లాకు పంపా. ఆమె రెండు డిజైన్స్ వేశారు. ఇప్పుడు చూస్తున్న లుక్‌ను ఓకే చేశాం. తమన్నా ఎండలో చెప్పులు లేకుండా, సినిమా పూర్తయ్యేదాకా శాకాహారిగా మారిపోయారు. ఇండియన్ సూపర్ స్టార్ సినిమాల్లో ఉండే క్వాలిటీ గ్రాఫిక్స్ మా చిత్రంలో ఉన్నాయి. -ఈ కథ అనుకున్న వెంటనే ఫైనల్ చేసిన ఫస్ట్ టెక్నీషియన్ అజినీష్.

దానికి కారణం ‘కాంతార’. డైరెక్టర్ అశోక్‌ను డైరెక్టర్ చేయాలనే ‘ఓదెల’ తీశాం. ఇప్పుడిది కూడా అద్భుతంగా తీశాడు. ఈ సినిమాకు నిర్మాత మధు సంకల్ప బలమూ తోడయింది. -ఇలాంటి కథ రాస్తానని నేను అనుకోలేదు. నా భార్య ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఎనిమిది ఏళ్లవుతోంది. శివుడి మహిమల గురించి పుస్తకాల్లో చదివా. అవన్నీ మస్తిష్కంలో ఉన్నాయో ఏమో..! ఈ సినిమా రూపంలో బయటికొచ్చాయి. ఈ సినిమాకు మూడో భాగమేమీ ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటివన్నీ దేవుడే ప్లాన్ చేయాలని భావిస్తా. ఇది ఆ కాలభైరవుడే రాయించాడని నమ్ముతున్నా. శర్వానంద్‌తో సినిమా.. వాస్తవ ఘటనలను ఆధారంగా రూపొందిస్తున్నాం. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ ఊరిలో 1960ల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని ఫిక్షన్‌గా మార్చి చేస్తున్నాం.