మంథని, జూలై 2: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఓడేడు మానేరు వాగుపై గత ప్రభుత్వం రూ.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి గ్యాడర్లు మంగళవారం సాయంత్రం తేలికపాటి వర్షానికి కూలిపోయాయి. రెండు నెలల క్రితం గాలి దుమారానికి ఇదే వంతెనలోని రెండు గ్యాడర్లు కూలిపోగా... తాజాగా మంగళవారం చిన్నపాటి వర్షానికి కూలడం మరోసారి ప్రకంపనాలు సృష్టించింది. దీంతో సాయంత్రం నుంచి అటువైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
వంతెన నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం మూలంగానే కూలుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తేలికపాటి వర్షాలకే గ్యాడార్లు కూలుతుంటే భారీ వర్షాలు పడితే వంతెన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ సంఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వంతెనలు కూలుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.