calender_icon.png 19 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ ద్రవ్యోల్బణం 6 శాతంపైనే!

11-11-2024 12:24:08 AM

యూనియన్ బ్యాంక్ అంచనా

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఆహారోత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నందున, అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) అనలిస్టులు అంచనా వేశారు. నవంబర్ 12న అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా వెలువడనున్న నేపథ్యంలో యూబీఐ తాజాగా ఒక రిపోర్ట్ విడుదల చేస్తూ వినిమయ ధరల సూచి పెరుగుతుందని, ఆర్బీఐ గరిష్ఠ సహనస్థాయి 6 శాతాన్ని మించి 6.15 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. 

అ ఏడాది  ఆగస్టులో 3.65 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.49 స్థాయికి ఎగిసింది. గతంలో 2023 ఆగస్టులో ఇది 6 శాతాన్ని మించింది. ఈ అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం పెరగవచ్చంటూ ఇటీవలి ఆర్బీఐ ద్రవ్య సమీక్షలో సైతం పేర్కొన్న సంగతిని యూబీఐ గుర్తుచేసింది. ఇక తాజా నవంబర్ నెలలో సైతం గరిష్ఠస్థాయిలోనే రిటైల్ ధరలు కొనసాగుతాయని యూనియన్ బ్యాంక్ అంచనాల్లో పేర్కొంది. 

డిసెంబర్‌లో ఆర్బీఐ రేట్ల కోత ఉండదు

అక్టోబర్, నవంబర్ నెలల్లో కూరగాయలు, వంటనూనెల ధరలు భారీగా పెరిగాయని, గరిష్ఠస్థాయిలోనే ద్రవ్యోల్బణం కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ సమీక్షలో రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించబోదని యూబీఐ నివేదికలో అంచనా వేసింది. ఖరీఫ్ పంట దిగుబడి, రబీ పంట సాగుతీరుపై రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంటుందని,  ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ధరలు తగ్గుముఖం పట్టవచ్చని యూనియన్ బ్యాంక్ పేర్కొంది. అయితే వంటనూనెలపై విధించిన దిగుమతి సుంకాలు, ట్రంప్ టారీఫ్‌ల ప్రభావాన్ని నిశితంగా గమనించాల్సి ఉన్నదని తెలిపింది.