calender_icon.png 5 October, 2024 | 4:45 PM

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా

05-10-2024 12:04:16 AM

ఆపై నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్, ల్యాండ్ అమ్మకం

ముఠా గుట్టు రట్టుచేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాటిని కబ్జా చేసేందుకు గద్దల్లా వాలిపోతుంటారు. తాజాగా అలాం టి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల దందా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. శుక్రవారం బాలానగర్ జోన్ డీసీపీ సురేష్‌కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో తమ 200 గజాల స్థలం కబ్జాకు గురైందంటూ లెండ్యాల సురేశ్ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా స్థలాన్ని పద్మాజారెడ్డి అలియాస్ పద్మక్క నకిలీ పత్రాలతో కొట్టేసేందుకు పథకం వేసినట్లు గుర్తించారు. ఇందులో భాగంగా కరుణాకర్ అనే వ్యక్తికి రూ.3.50 లక్షలు ముట్టజెప్పి అతని ద్వారా నకిలీ పత్రాలు  సృష్టించింది.

ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంలో అరితేరిన కరుణాకర్ తన ముఠాతో కలిసి నకిలీ డాక్యుమెంట్లు తయారీ చేయించాడు. భూ యజమాని సురేష్ 1992లో చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిడ్ సర్టిఫికెట్ సృష్టించి, ఆధార్ సెంటర్‌లో పనిచేసే హరీశ్ అనే వ్యక్తి సహాయంతో ల్యాండ్ ఓనర్ పేరుతో నకిలీ ఆధార్ తయారు చేయించాడు.

అనంతరం 2023 ఫిబ్రవరి 22న నకిలీ పత్రాలతో కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్  కార్యాలయంలో రిజిస్ట్రార్ సాయంతో రవిశంకర్ (డూప్) ద్వారా పద్మజారెడ్డి తన చెల్లి నాగిరెడ్డి కోమల కుమారి పేరుతో 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు పత్రాలు సృష్టించారు.

విచారణలో భాగంగా పూర్తి ఆధారాలతో ముఠా సభ్యులు.. నాగిరెడ్డి కోమల కుమారి, పద్మజ, గగనం నరేంద్ర, వత్రమ్ రవిశంకర్, మేకల హరీశ్, రేపాక కరుణాకర్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆధార్‌కార్డు మాడిఫికేషన్ మెషీన్, పలు నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.