calender_icon.png 26 October, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పోచమ్మ’ను మింగుతున్న కబ్జాదారులు

12-09-2024 12:04:36 AM

  1. 64.39 ఎకరాల చెరువు ఆరెకరాలకు.. 
  2. ఏండ్లు గడుస్తున్నా గుర్తించని ఎఫ్‌టీఎల్ 
  3. నీరు రాకుండా గోడలు.. బయటకు పంపేందుకు కన్నాలు

మంచిర్యాల, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణ నడిబొడ్డున 1920లో పోచమ్మ చెరువును నిర్మించారు. ఈ చెరువు వి స్తీర్ణం 64.39 ఎకరాలు. అప్పట్లో 200 ఎకరాల్లో పంటలకు సాగునీరందించేది. కబ్జాదారుల కన్ను చెరువుపై పడట ంతో ఇప్పుడు కేవలం ఆరెకరాల విస్తీర్ణానికి చేరుకుంది. 1973లో ల్యాండ్ సీలింగ్ యాక్టు అమలు చేయగా అప్పట్లో శిరీషాదేవి పేరిట ఉన్న 64.39 ఎకరాల చెరువులో 5.10 ఎకరాలు (శిఖం) తన పేరిట ఉంచుకుని, మిగితాది చెరువుకే వదిలేశారు. శిరీషాదేవి వేరే దేశంలో ఉండటంతో ఆసరగా చేసుకున్న కబ్జాదారులు శిరీషాదేవి అమ్మినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. మామూళ్లకు మరిగిన రెవెన్యూ అధికారుల సహాయ ంతో ఆర్‌ఓఆర్‌లో రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చుకుని చెరువులో మట్టిని నింపు తూ అమాయక ప్రజలకు అమ్మారు. 

ఇప్పటికీ ఎఫ్‌టీఎల్ గుర్తించలేదు..

రాజుల కాలం నాటి చెరువుకు ఇప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎఫ్‌టీఎల్ పరిధిని గుర్తించలేదు. 2017లో చెరువు కబ్జా అవుతుందని మత్స్యకార సొసైటీ సభ్యులు అప్పటి కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రొహిబిటేడ్ ల్యాండ్‌గా గుర్తించి హద్దులు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేకు వెళ్లిన అధికారులను కబ్జాదారులు అడ్డుకొని ఈ సమస్య కోర్టులో కేసు ఉన్నదని, సర్వే చేస్తే తామంతా చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. నాటి నుంచి నేటి వరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులు వేసేందుకు ముందుకు రావడం లేదు. 

చెరువులోకి నీరు రాకుండా గోడలు

చెరువులోకి వరద నీరు, మురుగు నీరు రాకుండా కబ్జాదారులు గోడలు కట్టారు. చెరువులోకి నీరు రాకుండా ఎల్ ఆకారంలో గోడను నిర్మించారు. మరోవైపు మత్తడి వద్ద పెద్దగోడను నిర్మించారు. వీటితో పాటు చెరువు భూముల్లో అన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల భారీగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో నీటి మట్టం పెరుగుతుందని కొందరు కబ్జాదారులు మత్తడి వైపు కట్టను తెంపి నీటిని బయటకు పంపించారు. కట్ట తెగిందనే విషయం మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు.