- ఆ ఇండ్లు అర్హులకు అందిచేలా చర్యలు
- అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజక వర్గ పరిధిలోని నందనవనంలో రాష్ట్రప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్ర మించుకున్నవారిని తక్షణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య, కేటాయింపుపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వఇండ్లను ఆక్రమించుకున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని అధికారులకు సూచించారు.
అలాగే మంకాల్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఉన్న న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్క రించాలని సూచించారు. ఈ రెండు అంశాలపై తనకు పూర్తిస్థాయి నివేదిక అందించాలని, వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా వాణిలో గృహనిర్మాణానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులను సచివాలయంలోని తన కార్యాలయానికి పంపించాలని నోడల్ అధికారిణి దివ్యకు సూచించారు. వాటి పరి ష్కారానికి తన కార్యాలయంలో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు.
సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ డీ దివ్య, ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ నారాయణ్‌రెడ్డి, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన డాక్టర్ ఎస్ హరీశ్, కే శశాంక్ తదితరులు పాల్గొన్నారు.