28-03-2025 12:36:56 AM
హుస్నాబాద్, మార్చి 27 :గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఎదిగిన హుస్నాబాద్‌లో అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అనుమతులకు మించి భారీ సంఖ్యలో కట్టడాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీకి ఒక ప్లాన్ చూపిస్తూ.. మరో ప్లాన్ ప్రకారం నిర్మాణం చేపడుతూ మున్సిపల్కు రావాల్సిన ఆదాయానికి అక్రమార్కులు గండికొడుతున్నారు.
పట్టణంలో క్రమంగా పెరుగుతున్న అపార్టుమెంట్ సంస్కృతితో ఎక్కడ చూసినా బంగ్లాల నిర్మాణమే కనిపిస్తోంది. ఇదే అదనుగా చేసుకొని కొందరు బిల్డర్లు, ఇండ్ల యజమానులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి రెచ్చిపోతున్నా రు. బహుళ అంతస్తులలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నా పార్కింగ్ స్థలాలను వదలడంలేదు. పార్కింగ్ స్థలంలో యథేచ్ఛగా వాణిజ్య సముదాయాల కోసం మడిగెలను నిర్మిస్తున్నారు.
మున్సిపాలిటీకి రూ.కోట్లలో నష్టం
పట్టణంలో జరిగే ప్రతీ అక్రమ కట్టడం వెనుక ఒక రాజకీయ నాయకుడి అండ ఉం డడం సాధారణంగా మారింది. అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు జరి గితే, మరికొన్ని అనుమతులకు విరుద్ధంగా వెలుస్తున్నాయి. జీ+1 అనుమతి తీసుకొని జీ+4 భవనాలు నిర్మాణం చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నివాసయో గ్యమైన, వాణిజ్య, బహుళ అంతస్తుల నిర్మాణాల్లో నిబంధనలు కానరావడంలేదు.
దీంతో కోట్లాది రూపాయలు మున్సిపాలిటీ నష్టపోవాల్సి వస్తోంది. ఇందులో టౌన్ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిర్మాణం ప్రారంభమైనప్పుడే నిలువరించాల్సింది పోయి మామూలుగా చూ స్తుండడంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామ పంచాయతీగా ఉన్న హుస్నాబాద్ మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అపార్ట్ మెంట్ సంస్కృతి పెరుగుతోంది. దీంతో భారీ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు జోరందుకున్నాయి.
ఇష్టారాజ్యంగా అనుమతులు
ఇక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటు అక్రమ నిర్మాణాలను ఉపేక్షించడంతో పా టు భవన నిర్మాణాల కోసం ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్త ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా, అధికారుల చేయి తడపనిదే పర్మిషన్ రాదనే విమర్శలున్నాయి.
ఇంటి ప్లాన్, నిర్మాణ స్థలం, దస్తావేజులను పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారంటున్నారు. దీంతో వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతి పొందిన దానికి, నిర్మాణాలు జరుగుతున్నవాటికి తేడాలు ఉంటున్నాయి. అక్రమ నిర్మాణాలపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
కోర్టులో వివాదం నడుస్తున్న స్థలాల్లో సైతం అనుమతులు జారీ చేయగా గతంలో కొందరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆ యన అందు బాటులోకి రాలేదు.