* పిల్‌ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, జనవరి 29, (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంట్మోనెంట్ ప్రాంతంలోని పబ్లిక్ గార్డెన్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటు చేసేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. పార్కులో విగ్రహం ఏర్పా టు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు బుధవారం కొట్టేసింది.
సికింద్రాబాద్ ప్రాంతంలోని పికెట్ పబ్లిక్ గార్డెన్‌లోని విగ్రహాల ఏర్పాటును వ్యతి రేకిస్తూ అక్రమ నిర్మాణాలను తొలగించాలని, వాజపేయి స్మారక విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త జే ఉమేశ్వరరావు పిల్ వేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 13 ఎకరాల పార్కు నిర్మాణాలతో, కబ్జాలతో కుచించుకుపోయినట్టు కోర్టు దృష్టికి తీసు కెళ్లారు. రాజకీయ నాయకుల స్మారక విగ్రహాల ఏర్పాటు కోసం చేపడుతున్న నిర్మాణాలను తొలగించాలని కోరారు. కేంద్రం వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
అయితే కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ గార్డెన్ సుందరీకరణలో భాగంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. దేశానికి అంతర్జాతీయంగా ప్రతిష్ఠలు తీసుకువచ్చిన మాజీ ప్రధాని సంస్మరణ నిమిత్తం వాజపేయి విగ్రహ ఏర్పాటుకు 2022లోనే అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నారు.
కుల, మతాల ప్రాతిపదికన విగ్రహం ఏర్పాటు చేయడంలేదనీ.. భావితరాలకు స్ఫూర్తినిచ్చి న నేత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధం కాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం వాజపేయి విగ్రహ ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా విగ్రహం ఏర్పాటు జరగలేదంటూ పిల్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.