calender_icon.png 30 April, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు కాలనీలకు తొలగిన ఆటంకం

30-04-2025 12:07:47 AM

హైడ్రా చర్యలతో తగ్గిన దూరం

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు

రాజేంద్రనగర్, ఏప్రిల్ 29: రెండు కాలనీలకు దూరాన్ని తగ్గించింది.. నేరుగా షేక్ పేటకు రావాలనుకున్నా.. ఇటు నుంచి గోల్కొండ కోటకు చేరాలన్నా దగ్గర దారిని హైడ్రా చూపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నెక్నాంపూర్ గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద.. కబ్జాదారులు నిర్మించిన అడ్డుగోడను మంగళవారం హైడ్రా తొలగించింది. దీంతో శ్రీ వేంకటేశ్వర కాలనీకి, ఉస్మానియా కాలనీకి మధ్య అనుసంధానం ఏర్పడింది. ఈ రెండు కాలనీలకు మధ్య ఒక గుట్టలా ఉన్న ప్రాంతాన్ని ఆసరాగా తీసుకుని.. హైటెన్షన్ విద్యత్ తీగలు పైనుంచి వెళ్తున్నప్పటికీ దిగువ వైపు దాదాపు 800ల గజాలకు పైగా ఉన్న స్థలంలో షెడ్లు వేసి ఆక్రమించిన వైనాన్ని శ్రీ వేంకటేశ్వరా కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్గారు క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే ఈ అడ్డుగోడను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు షెడ్లను తొలగించారు. మధ్యలో అడ్డంగా ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించింది. దీంతో శ్రీ వేంకటేశ్వర కాలనీ - ఉస్మానియా కాలనీకి మధ్య 30 అడుగుల రహదారికి ఆటంకాలు తొలిగాయి. ఇరు కాలనీవాసులే కాదు.. ఆ మార్గంలో సులభంగా చేరుకునే అవకాశం 3 వేల మందికి లభించినట్టు అయింది. దీంతో స్థానికులు హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.