తన పొలానికే నిప్పంటించిన మహిళ
గ్రీస్, సెప్టెంబర్ 4: అగ్నిమాపక సిబ్బందిపై మనసు పారేసుకున్న ఓ మహిళ.. వారితో రొమాన్స్ చేసేందుకు ఏకంగా తన పొలానికే రెండు సార్లు నిప్పు పెట్టింది. ఆమె వ్యవహారం తెలిసి సదరు మహిళకు కోర్టు జైలు శిక్ష విధించింది. గ్రీస్‌లోని ట్రిపోలీ పరిధిలో ఉన్న కెరిసిటా ప్రాంతంలో గత నెల 24, 25 తేదీల్లో వరుసగా ఓ అగ్రికల్చర్ ల్యాండ్‌లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. కార్చిచ్చుల సమస్య అధికంగా ఉన్న ఈ దేశంలో ఇవి ప్రమాదకరంగా మారుతాయని భావించిన అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని, మంటలు ఆర్పారు.
మంటలను ఎలా ఆర్పుతారో చూడాలనుకున్న సదరు మహిళ (44) తన పంటకు నిప్పు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో పాటు వచ్చిన సిబ్బందితో రొమాన్స్ చేయొచ్చిన ఆశించింది. విస్తుపోయే నిజాలు తెలుసుకున్న ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ఆమెకు 1,106 డాలర్ల జరిమానా, 36 నెలల జైలు శిక్ష విధించారు. గ్రీస్‌లో కార్చిచ్చుల సమస్య అధికంగా ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన కార్చిచ్చు కారణంగా ఆ దేశ రాజధాని నగరమైన ఏథెన్స్ శివారులో మంటలు దానావాలంలా వ్యాపించాయి. వేల మంది పౌరులు ఆశ్రయం కోల్పోయ్యారు. ఆ దేశంలో మంటలు అంటించ డంపై చట్టపరంగా నిషేధం విధించారు. మంటలు అంటించి, నష్టానికి కారణమైనవారికి అక్కడ జైలు శిక్షలు సైతం విధిస్తారు.