పటాన్‌చెరు, మే 16 (విజయక్రాంతి) : పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన ఈవీఎం సెక్యూరిటీ లాక్ బుక్ రిజిస్టర్లను, మూడు అంచెల సెక్యూరిటీ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లోటుపాట్లకు తావులేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ సెక్యూర్టీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఐడీ కార్డు లేకుండా ఎవరిని అనుమతించొద్దని సీఆర్‌పీఎఫ్ సెక్యూర్టీ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూమ్‌లతో పాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చి మానిటర్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న ప్రతి కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ సీల్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్ ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఈఈపార్ సురేశ్, తహసీల్దార్ రంగారావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.