calender_icon.png 19 October, 2024 | 5:06 AM

పెరిగిపోతున్న స్థూలకాయం

23-07-2024 12:05:00 AM

  • తొలి రెండు స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు 
  • మూడో స్థానంలో ఏపీ
  • తెలంగాణలోనూ సమస్య ఎక్కువే

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న స్థూలకాయం (ఒబేసిటీ)పై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.అత్యధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై అప్రమత్తత అవసరమని అభిప్రాయ పడింది. దేశంలో 54 శాతం అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని సర్వే పేర్కొంది. ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకునేలా దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఒబేసిటీ అంశం ప్రస్తావనకు వచ్చింది. దేశంంలో ఒబేసిటీ ఆందోళనకరంగా మారిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.

దేశంలోని యువజనాభానుంచి మెరుగైన ప్రయోజనం పొందాలంటే వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటుగా వారిని ఆరోగ్యకరమైన అలవాట్లవైపు మళ్లించడం కీలకమైన అంశంమని అభిప్రాయపడింది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ ఇటీవల వెలువరించిన నివేదికను ఉటంకిస్తూ, అధిక చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం కూడా విపరీతంగా పెరిగిందని సర్వే తెలిపింది. శారీరక శ్రమ( ఫిజికల్ యాక్టివిటీ) తగ్గిపోవడం అధిక బరువు లేదా ఒబేసిటీకి కారణమవుతోందని సర్వే విశ్లేషించింది. పెద్దల్లో స్థూలకాయం మూడింతలు పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య  వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో వియత్నాం, నమీబియా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందంటూ వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదికను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 

పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం.. గ్రామీణ భారతంతో పోలిస్తే పట్టణ జనాభాలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థూలకాయం సమస్య 19.3 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 29.8 శాతంగా ఉంది. 1865 ఏళ్ల మధ్య వయసు కల పురుషుల్లో  స్థూలకాయం 18.9 శాతంనుంచి 22.9 శాతానికి పెరిగింది. అదే మహిళల్లో 20.6 శాతంనుంచి 24 శాతానికి పెరిగింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య మరీ ఆందోళనకరంగా ఉందని సర్వే అభిప్రాయపడింది. మారుతున్న జీవన విధానాలే ఇందుకు కారణమని విశ్లేషించింది.

దేశ రాజధాని ఢిల్లీలో  మహిళలు 41.3 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతుండగా పురుషుల్లో ఇది 38 శాతంగా ఉంది. తమిళనాడులో పురుష జనాభాలో 37 శాతం, మహిళా జనాభాలో 40.4 శాతం మంది ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారని  తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల్లో 31.1 శాతం, మహిళల్లో 36.3 శాతం మందిని ఈ స్థూలకాయం సమస్య వెంటాడుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.2 శాతంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.