తక్కువ రోజుల్లో అధిక దిగుబడి ఇచ్చే వంగడం
రాజేంద్రనగర్, నవంబర్ 20: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్‌లోని కండ్లకోయలో తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడినిచ్చే ఎన్‌పీ-8912 రకం వరి వంగడాన్ని సంస్థ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వరి వంగడం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో సాగుకు అనుకూలమని వెల్లడించారు.
ఈ వంగడం ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు. 113-118 రోజుల వ్యవధిలో సూపర్ రైస్ గింజలు పక్వానికి వచ్చి అధిక దిగుబడిని అందిస్తుంది. ఎన్‌పీ-8912 రకం ఇతర స్వల్ప కాల రకాలతో పోలిస్తే అధిక మొత్తంలో నాణ్యత కలిగి ఉండి మంచి ఉత్పత్తిని ఇస్తోందని యాజమాన్యం పేర్కొంది.
ప్రతీ కంకికి 350 కంటే ఎక్కువ గింజలు కలిగి ఉంటాయని వివరించారు. ఎన్‌పీ-8912 రకం అగ్గి తెగుళ్లను తట్టుకొనే సామర్థ్యం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ తరఫున శరత్ ఖురానా, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ డాక్టర్ దేవేంద్ర కడియన్ పాల్గొన్నారు.