calender_icon.png 16 November, 2024 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలి

16-11-2024 06:24:25 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులను వినియోగించాలని తెలిపారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని తెలిపారు. మ్యాథ్స్ బోధించే ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారిని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.