రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు ఆనంద్, జ్యోతి
ఖమ్మం, నవంబర్ 21 (విజయక్రాంతి): దేశంలో ప్రతి పౌరుడికి పౌష్టికాహారం స్వీకరించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దీనిలో భాగంగానే ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భూక్యా జ్యోతి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం ఆహార భద్రత చట్టం అమలుపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు.
విద్యార్థులకు మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం భోజన మెనూను తయారు చేశామన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలల్లో కులాల వారీగా అటెండెన్స్ స్వీకరణను గమనించామని, ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. రెసిడెన్సియల్ పాఠశాలలకు తక్కువ సైజు గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు మెమో జారీ చేయాలన్నారు. అధికారులు రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించాలని సూచించారు.
అంగన్‌వాడీ టీచర్లు ఇండ్లకు వెళ్లి పాలు ఇవ్వద్దని అన్నారు. కొణిజర్ల మండలం సీతాపురంలో ఇలా ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆశ వర్కర్లు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధికంగా ప్రసవాలు ఉండేలా చూడాలన్నారు.