calender_icon.png 20 April, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణుయుద్ధ భయాలు

21-11-2024 12:00:00 AM

మరో అణుయుద్ధం పొంచి ఉందా?  ప్రపంచ దేశాలను ఇప్పు డు భయపెడుతున్న అంశం ఇదే. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రత ఈ భయాలకు మరింత ఊతమిస్తోంది. రెండుదేశాల మధ్య యుద్ధం మొదలై సోమవారం నాటికి వెయ్యి రోజులైంది. అయినా రెండు దేశాల్లో ఏది కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికాతో పాటుగా నాటో దేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థిక సాయం అండతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాపై దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు.

మరో వైపు ఉక్రెయిన్‌లోని కీలక స్థావరాలే లక్ష్యంగా రష్యా నిత్యం దాడులను కొనసాగిస్తూ ఉంది. తాజాగా ఆయుధ సాయంలో భాగంగా తాము అందించిన దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు అనుమతిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న దుందుడుకు నిర్ణయంతో  రష్యా, ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయా యి.

అమెరికా అనుమతి ఇవ్వడమే తడవుగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి ఆరు దీర్ఘ శ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్)ను ప్రయోగించింది. వీటిని కూల్చేశామని రష్యా ప్రకటించింది. అయితే బైడెన్ నిర్ణయం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపై నేరుగా దాడి చేస్తే అణ్వస్త్రాలను వాడడానికి వీలుగా తమ దేశ అణు ముసాయిదాను సవరించారు.

దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు కూడా. అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని దానిలో స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాకు పొరుగున ఉన్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీరు లాంటి వాటిని నిల్వ చేసుకోవాలని స్వీడన్, ఫిన్లాండ్, నార్వే తదితర దేశాలు తమ ప్రజలకు సూచించాయి. ఈ మేరకు లక్షల సంఖ్యలో కరపత్రాలను పంపిణీ చేశాయి. ఫిన్లాండ్, నార్వే దేశాలు ఇటీవలే నాటో కూటమిలో సభ్యదేశాలుగా చేరాయి. 

రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అనుమతించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గత కొంతకాలంగా అమెరికాపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా బైడెన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో బైడెన్ సర్కార్ ఈ క్షిపణుల ప్రయోగానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

మరో రెండు నెలల్లో అధ్యక్ష పీఠంనుంచి దిగిపోనున్న తరుణంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో వేలాది మంది చనిపోగా లక్ష మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ యుద్ధంలో రష్యా సైన్యానికీ భారీగా ప్రాణన ష్టం జరిగినట్లు అంచనా. వేల సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్‌లో 25 శాతం భూభాగం మరుభూమిగా మారినట్లు చెబుతున్నారు. 

 ఇక అణుయుద్ధం అనివార్యమయితే ప్రపంచవ్యాప్తంగా ప్రాణనష్టం లక్షల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉత్తర కొరియా  నేత కిమ్ వీలయినన్ని ఎక్కువ అణ్వస్త్రాలను సిద్ధం చేయాలని ఆదేశించడంతో యుద్ధ జ్వాలలు కొరియా ద్వీపకల్పం దాకా విస్తరిం చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నిలువరిం చడమే పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని నిపుణులు అంటున్నారు.

రష్యాఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్, చైనాలాంటి బ్రిక్స్ దేశాలకే ఉందని, ఉక్రెయిన్‌తో చర్చలనే తాము కోరుకుంటున్నామని మన దేశంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏది ఏమయినా ఇప్పుడు ప్రపంచాన్ని అణుయుద్ధ భయం కమ్మేసిందనేది నిజం.