calender_icon.png 30 September, 2024 | 8:02 AM

ఉహాన్‌లో అణుముప్పు!

28-09-2024 01:47:01 AM

  1. మునిగిపోయిన చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్
  2. అమెరికా మీడియాలో వరుస కథనాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: అమెరికాకు పోటీగా నౌకాదళ శక్తిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డ్రాగన్ దేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న అణుజలాంతర్గాముల్లో ఒకటి ఇటీవల మునిగిపోయింది. రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ నగర సమీపంలోని వుచాంగ్ షిప్‌యార్డులో ఈ ప్రమాదం జరిగిందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ మార్చి 10న తీసిన శాటిలైట్ చిత్రాల ప్రకారం.. వూహాన్ సమీపంలోని ఓ షిప్‌యార్డు వద్ద అణుసబ్‌మెరైన్‌ను  చైనా నిలిపింది. అయితే జూన్ నెలలో తీసిన చిత్రాల్లో మాత్రం ఆ సబ్‌మెరైన్ తీరం వద్ద కనిపించలేదు. అది మునిగిపోయిందని ఇటీవల అమెరికాలోని పలు మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి. యూఎస్ రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

అయితే ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు. గతేడాది ఆగస్టులో కూడా చైనాకు చెందని సబ్‌మెరైన్ ‘093  ఎల్లో సముద్ర జలాల్లో మునిగిపోయింది. అందులో ఉన్న 55మంది సబ్‌మెరైనర్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదంపై కూడా డ్రాగన్ దేశం ఇప్పటివరకు స్పందంచలేదు.