* అనారోగ్య సమస్యలతో ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో మృతి
* పోఖ్రాన్‌లో జరిగిన రెండు అణు పరీక్షల్లో కీలక పాత్ర
* ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
ముంబై, జనవరి 4: ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం(88) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3.20గంటలకు తుదిశ్వాస విడించారు. చిదంబరం మరణ వార్తను భారత అణుశక్తి విభాగం(డీఏఈ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా దేశ శాస్త్రీయ రంగం లో ఆయన చేసిన అసమానమైన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది.
ప్రముఖుల సంతాపం
రాజగోపాల చిదంబరం మరణంపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. భారత అణు కార్యక్రమ నిర్మాతల్లో చిదంబరం కీలకంగా వ్యవహరించినట్టు గుర్తు చేశారు. దేశ శాస్త్రీయ, వ్యూహాత్మక సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఆయన కృషి చేశారన్నారు. ఆయన సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయం గా ఉంటాయని పేర్కాన్నారు.
దేశం మొత్తం ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. చిదంబరం మరణంపట్ల కాంగ్రెస్ చీఫ్ మల్లికా ర్జున ఖర్గే, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను స్మరించుకుని నివాళులర్పించారు.
రెండు అణు పరీక్షల్లో పాల్గొన్న శాస్త్రవేత్తగా గుర్తింపు
డాక్టర్ రాజగోపాల చిదంబరం 1936లో చెన్నైలో జన్మించారు. మాద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ విభాగంలో బీఎస్పీ పూర్తి చేశారు. 1962లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1974లో జరిపిన పోఖ్రాన్ 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు.
దీంతో రెండు అణు పరీక్షల్లో పాల్గొన్న అణు శాస్త్రవేత్తగా చిదంబరం గుర్తింపు పొందారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆయన.. అణుశక్తి కమిషన్ చైర్మన్‌గానూ విధులు నిర్వర్తించారు. భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా కూడా చిదంబరం సేవలందించారు. చిదంబరం సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.