- ఉక్రెయిన్‌కు చెందిన అణు విద్యుత్ కేంద్రంపై దాడి
- కూలింగ్ టవర్ నుంచి ఎగిసిపడిన మంటలు
- ఒకరినొకరు నిందించుకున్న రష్యా, ఉక్రెయిన్
- రెండేళ్ల నుంచి మాస్కో అధీనంలో ఉన్న ప్లాంట్
- ప్లాంట్ పేలితే యూరోప్ మొత్తం ప్రభావం పడే అవకాశం
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. ఉక్రెయిన్ కు చెందిన జపోరిజియా అణుకేంద్రం ప్రస్తు తం రష్యా నియంత్రణలో ఉంది. అయితే ఆదివారం దీనిపై డ్రోన్ దాడి జరగడంతో దాని కూలింగ్ టవర్‌లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 1986లో ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం పేలగా ఆ ప్రభావం ఇప్పటికీ యూరోప్‌లో కనిపిస్తుంది.
ప్రపంచంలో అతిపెద్ద అణు ప్రమాదంగా దీన్ని పరిగణిస్తారు. ఐరోపాలోని అనేక దేశాలు దీని ప్రభావానికి లోనయ్యాయి. రేడియేషన్ వేల కిలోమీటర్ల మేర వ్యాపించింది. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు రష్యా ఇప్పటికీ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. 2011లో జపాన్‌లో వచ్చిన సునామి కారణంగా ఫుకుషిమాలోని దైచి అణు విద్యుత్ కేంద్రం ధ్వంస మైంది. అందులోని రేడియేషన్‌ను తొలగించేందుకు ఆ దేశం ఎంత ప్రయత్నించినా సఫ లం కావడంలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం పేలితే అంతకుమించిన ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో ఇదే పెద్ద అణు ప్రమాదంగా నిలిచే అవకాశముందని చెబుతున్నారు. దీంతో ఐరోపా వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా సరిహద్దు దేశాలు ఆందోళనలో ఉన్నాయి.
ఇరు దేశాల ప్రత్యారోపణలు
జపోరిజియా కేంద్రంపై దాడి విషయంలో రష్యా, ఉక్రెయిన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రష్యా దళాలే పేలుళ్లలకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. తమను బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని మండిప డ్డారు. రష్యా కూడా ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్లతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతోంది. ప్రమాదం నేపథ్యంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) సిబ్బంది అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి అణు లీకేజీ జరగలేదని చెప్పారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని కోరారు.
జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కూలింగ్ టవర్‌లో ఆదివారం కూడా భారీగా మంటలు చెలరేగినట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమించిన గవర్నర్ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ తెలిపారు. తమ దళాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత 2022లో ఈ అణుకేంద్రాన్ని రష్యా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. మొత్తం ఆ రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కోల్డ్ షట్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా ఈ ప్లాంట్ కూలింగ్ టవర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు ఐఏఈఏ నిపుణలు ఎక్స్ వేదికగా వెల్లడించారు.