calender_icon.png 5 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వించడం గొప్ప వరం: ఎన్టీఆర్

04-04-2025 10:56:40 PM

నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌స్క్వేర్’. కళ్యాణ్‌శంకర్ దర్శకత్వం వహించారు. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకుడు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మేకర్స్ ఈ సినిమా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు బాధలు, కష్టాలు ఎన్ని ఉన్నా.. ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్లిపోతాం కదా! అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఇప్పుడు దర్శకుడు కళ్యాణ్‌శంకర్‌గా మనకు దొరికాడు ఇక్కడ. ‘మ్యాడ్2’తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్నారు కళ్యాణ్. కళ్యాణ్‌ది స్వచ్ఛమైన హృదయం. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అది. చాలా స్వచ్ఛంగా కథను రాయగలగాలి. ఆయన ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని,  కెరీర్‌లో అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నా. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన టీమ్‌కు కంగ్రాట్స్. ముఖ్యంగా ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ అద్భుతంగా నటించారు. అలాగే ఆంథోనీ. సినిమా చూస్తూ, అతను ఎంటర్ అయినప్పుడు నేను కూడా చప్పట్లు కొట్టాను. ఒక కామెడీ చేయగలిగిన క్యారెక్టర్ ఒక మాస్ హీరోలా ఎంట్రీ ఇవ్వడం బాగుంది. లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపించింది.

నన్ను అందరూ అడుగుతుంటారు.. రాముడిగా చేయడం కష్టమా? రావణుడిగా చేయడం కష్టమా? అని! రాముడిగా చేయడమే కష్టం. ఎందుకంటే జీవితంలో ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం. ఆ ఇన్నోసెన్స్ విష్ణు బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనలో ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదు. సంగీత్‌ను, వాళ్లన్నయ్య సంతోష్‌ను చూస్తే.. నాకు శోభన్ గుర్తుకొస్తారు. శోభన్ మన మధ్యే ఉండి, సంగీత్ సక్సెస్‌ను చూసి గర్వపడుతున్నారనుకుంటున్నా. మ్యాడ్1లో రామ్‌నితిన్ యంగ్‌గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు. మ్యాడ్‌లో రామ్‌నితిన్ అద్భుతంగా నటించాడు. కామెడీ పలికించడం యాక్టర్‌కు చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నా. రామ్‌నితిన్‌కు మంచి భవిష్యత్తు ఉంది.

నాకు 2011లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యం చెప్పిన ఒకేఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. నేను నీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్లు అని చెప్పా. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్లాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. సినిమాలో సత్యం రాజేశ్, కార్తికేయ కామెడీకి కూడా బాగా నవ్వుకున్నా. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ధర్మవరం తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడు సునీల్. భాష మీద పట్టుంది. అలాగే కింది స్థాయి నుంచి ఎదుగుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చాలా కాలం తర్వాత సునీల్ కామెడీ చూసి మళ్లీ నవ్వుకున్నా. సునీల్ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. కానీ, నవ్వించడానికే అతను పుట్టాడని నేను నమ్ముతా. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్లందరి వెనుక ఆ కనబడని శక్తే నాగవంశీ. సినిమా అంటే ఆయనకు చాలా ప్యాషన్. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నా” అన్నారు.

ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నాకు ఇందాకటి నుంచి జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్ అని వినిపిస్తోంది. అది వింటూ ఉంటే ‘జైంట్’ గుర్తొస్తుంది. ఆయన నిజంగానే జైంట్‌” అన్నారు.

ఇంకా ఈ వేడుకలో చిత్ర కథానాయకులు నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్, దర్శకుడు కళ్యాణ్ శంకర్, నటీనటులు సునీల్, ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్, విష్ణు ఓఐ, సత్యం రాజేశ్, కార్తికేయ, ఆంథోనీ రవి, రామ్‌ప్రసాద్, గీత రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.