న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ సబ్సిడరీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో నవంబర్ 27న లిస్టవుతాయి. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను చేపడుతున్న ఎన్టీపీసీ గ్రీన్ రూ.10,000 కోట్ల సమీకరణకు గతవారం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ జారీచేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జారీఅయిన మూడో పెద్ద ఐపీవో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీదే. షేరుకు రూ.102-108 ప్రైస్‌బ్యాండ్‌తో కంపెనీ 59,31,67,475 షేర్లను ఆఫర్ చేయగా, 1,42,65,07,242 షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఆఫర్ 2.40 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అందుకున్నది.
ఐపీవోకు బిడ్ చేసిన ఇన్వెస్టర్లకు నవంబర్ 25, సోమవారంనాటికల్లా అలాట్‌మెంట్ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవోలో పూర్తిగా కొత్త ఈక్విటీ షేర్లనే జారీచేసింది. మాతృసంస్థ ఎన్టీపీసీ తన వద్దనున్న వాటాను యథాతథంగా అట్టిపెట్టుకున్నది.