calender_icon.png 23 December, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపురూప శాసన కావ్య నిర్మాత నృసింహర్షి

30-09-2024 12:00:00 AM

‘విశ్వేశ్వర సూనోర్నరసింహర్షేః కృతిః’ అంటూ ఒక అపురూపమైన లఘు కావ్యాన్నే రాళ్లపై రచించిన కవి నృసింహర్షి. ఇది సంస్కృత శృంగార కావ్యం. ‘సిద్ధోద్వాహం’ అన్న ఈ లఘు కావ్యాన్ని విశ్వేశ్వర పుత్రుడైన నృసింహర్షి పరమ సుందరమైన సంస్కృత వృత్తాలలో అతిరమ్యంగా రచించాడు. ఈ రచనలో 60 శార్దూల వృత్తాలతోపాటు 2 స్రగ్ధరా వృత్తాలు కూడా కలిసి మొత్తం 62 శ్లోకాలు ఉన్నాయి. 

వరంగల్లుకు సమీపంలోని ‘ఉర్సుగుట్ట’పై వున్న రాళ్లపై చెక్కబడ్డ ఈ కావ్య కవి ప్రతాపరుద్రుని కాలం వాడని, విశ్వేశ్వరుని పుత్రుడని చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. నాటి గోళకీ మఠాలలో ఒక దానికి అధిపతియైన వాడే ఈ విశ్వేశ్వర దేశికుడని కూడా తెలియజేశాడు. ఈ విశ్వేశ్వర దేశికుడే కాకతీయ చక్రవర్తియైన గణపతిదేవునికి శివదీక్ష నిచ్చిన గురువని తెలుస్తున్నది.

ఈయన ‘శివతత్త రసాయనము’ అనే గ్రంథమును రచించిన శివదీక్షా పరుడు. సంపూర్ణ శైవ దీక్షాదక్షుడైన ఈ విశ్వేశ్వర దేశికుల పుత్రుడైన నృసింహర్షికూడా పలు రచనలు చేసిన కవీశ్వరుడే. ఇతడు పది రూపకాలను ‘మలయ వతి’ అనే కావ్యాన్ని రచించినట్లు సాహిత్య పరిశోధకులు తెలియజేశారు.

అంతేగాక ‘ఋక్ ఛాయ’ అనే ఒక విశేష గ్రంథాన్ని రచించడమేగాక ఒకే ఒక్క రోజులో ఎనిమిది సర్గలున్న ఒక కావ్యాన్ని రచించిన ప్రతిభాశాలియైన వ్యక్తిగా సాహిత్యవేత్తలు గుర్తించారు. కాని, తెలుగువారి దురదృష్టం వల్ల ఈ రచనల్లో ఏ ఒక్క రచన కూడా ఈనాడు అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం. కేవలం రాళ్లపై రాయబడ్డ శిలా కావ్యమైన ‘సిద్ధోద్వాహ’ కావ్యం ఒక్కటే లభ్యమవుతున్నది.

ఐతే, ఈ శిలా కావ్యంలో దీని పేరు ‘సిద్ధోద్వాహం’ అన్నది లేదు. సుప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్రకారులు అయిన దివంగత పి.వి. పరబ్రహ్మశాస్త్రి, ఈ శాసన పాఠాన్ని చదివి దీన్ని ప్రకటించే సందర్భంలో ఇందులోని కథాంశాన్నిబట్టి దీనికి ఈ పేరు పెట్టారు.

ఈ శిలా కావ్య సౌందర్యాన్ని ప్రతి సాహితీ ప్రియుడు ఆస్వాదించగలిగే అవకాశాన్ని కలిగించిన పి.వి. పరబ్రహ్మశాస్త్రి స్వయంగా పండితులు, కావ్య హృదయం తెలిసిన మేధావి. కనుక వారు పెట్టిన ఈ పేరు ఎంత సార్థకమైందో ఇది చదివిన వారికి అర్థమవుతుంది. 

అరవై రెండు శ్లోకాల శృంగార రచన

కేవలం 62 శ్లోకాలలో గొప్పగా రాయబడిన ఈ శిలా కావ్యం శృంగార రస ప్రధానమైంది. లఘు కావ్యమే అయినా సంపూర్ణ కావ్య లక్షణాలున్న ఉత్తమ కావ్యంగా దీన్ని గుర్తించవచ్చు. “ఉత్తమ కావ్య లక్షణాల్ని కలిగి ఉన్న ఈ కావ్యం నృసింహర్షి కవితా ప్రావీణ్యాన్ని చక్కగా వెల్లడిస్తున్నది” అని డా. వై.నాగయ్య అభిప్రాయపడ్డారు. ఈ మాటలు సంపూర్ణ సత్యాలే.

స్థూలంగా దీని విషయాన్ని విచారించినప్పుడు కొన్ని కథకు సంబంధించిన అంశాలు అవగాహనలోకి వస్తాయి. “ఒక ఉద్యాన వనంలో ఓ కిన్నెర కాంత తన చెలికత్తెలతో కలిసి సంగీత నాట్యాలాపములతో విహరిస్తుంటుంది. అప్పుడు అక్కడే తిరుగుతున్న సిద్ధునికి ఆమెతో పరిచయం కలుగుతుంది.

అది ప్రేమగా మారుతుంది. ఇరువురు కలిసి ఉన్న ఆ సమయంలోనే తండ్రి పిలుపు మేరకు కిన్నెర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు తన విరహ వేదనను చెలికత్తె ద్వారా సిద్ధునికి తెలియజేస్తుంది. అతడు కూడా తన వ్యథను ఆమెకు తెలియజేస్తాడు. కిన్నెర స్త్రీ పరిచయమైనప్పటి నుంచి ఆమె తన వెంటనే ఉన్నట్లుగా ఊహించుకొంటూ సిద్ధుడు కాలం గడుపుతుంటాడు.

ఆ సమయంలో ఒకరోజు ఉదయం నిద్ర నుంచి లేవగానే తన పక్కన కిన్నెర లేకపోవడం గమనించి ఆమెతో తనకు కలిగిన పరిచయం, అందచందాలు, వివాహం, సంభోగం, సహవాసం, వంటి విషయాలను సిద్ధుడు ఊహించుకుంటూ ఉంటాడు.”

ఇటువంటి విషయాలను వర్ణించడం కావ్య విస్తృతికి దోహద పడుతుందని డా. వై.నాగయ్య అభిప్రాయపడటమే గాక ఈ సందర్భంలోనే నృసింహర్షి తన వర్ణనా నైపుణ్యాన్ని, కల్పనా చాతుర్యాన్ని అత్యద్భుతంగా కనిపింపచేశారని భావించడం ఈ లఘుకావ్యాన్ని చదివిన వారికి స్పష్టంగా బోధపడుతుంది.

అందుకే, ప్రముఖ సాహితీ వేత్త డా. యల్లంభట్ల నాగయ్య, మరొక సంస్కృత విద్వాంసులు ఎస్.వి. నరసింహ భట్టర్ సహకారంతో శాసనప్రతిని సరిచూసి, పరిష్కరించి, శ్లోకరూపంలోకి తీసుకొని వచ్చి పాఠకులకు పూర్తిగా ఉపయుక్తమయ్యేటట్లు చేశారు.

‘మేఘ సందేశాన్ని’ గుర్తుకు తెస్తుంది!

‘సిద్ధోద్వాహ’మనే ఈ లఘుకావ్యం ఒక ప్రయోగాత్మక శృంగార రచన. చదవగానే మహాకవి కాళిదాసుని ‘మేఘ సందేశం’ గుర్తుకువస్తుంది. అందులోని యక్షుని విరహం వంటిదే ఇందులో నాయకుడైన సిద్ధుని విరహం కూడా. నాయికకు దూరమైన నాయకుని విరహాన్ని నృసింహర్షి వర్ణించిన విధానం అత్యంత ప్రతిభాన్వితంగా ఉంటుంది.

నాయికా నాయకుల విరహ వర్ణన మాత్రమేగాక ఇందులో సందర్భానుసారంగా నృసింహర్షి కవి వర్ణించిన సూర్యాస్తమయ వర్ణన, సంభోగ శృంగార వర్ణన వంటి అనేక వర్ణనలు కవి ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఈ కావ్య రచనయే ఒక విచిత్ర రచనా ఫణితిలో సాగింది. ఇందులోని శ్లోకాలన్నీ శార్దూల వృత్తాలే. చివరి రెండు శ్లోకాలు మాత్రం స్రగ్ధరా వృత్తాలు.

కవికి ఛందస్సుపై సాధికారత ఉందనడానికి ఆయన పద్యాలే ప్రమాణాలు. ఛందస్సుపై అధికారం లేని కవి రచించిన శ్లోకాలు గాని, పద్యాలు గాని శైలీ విషయంగా, భావౌన్నత్య విషయంగా, ఊహాశాలిత విషయంగా చాలా కిందిస్థాయిలో ఉంటాయి. కాని, ఈ ‘సిద్ధోద్వాహం’లోని శ్లోకాలు గొప్ప శైలీ విన్యాసం కలిగిన ఉత్తమ శ్లోకాలేగాక సంపూర్ణ భావపుష్టి, గొప్ప ఊహాశాలిత్వం కలిగిన శ్లోకాలని స్పష్టంగా పఠితకు అర్థమైపోతుంది.

పరిపూర్ణ రస పోషణ

సాహిత్య ప్రపంచంలో అలంకారికులు నవరసాలను గురించి చెప్పినా అధికులు శృంగారాన్ని రసరాజంగా కీర్తించారు. సంస్కృతంలోనేగాక అనేకమైన ఇతర భారతీయ భాషల్లో కూడా అధికంగా శృంగార కావ్య రచనకే ఆయా కవులు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు.

శాసన కావ్య కవియైన నృసింహర్షికూడా తన శిలా కావ్యాన్ని రసభరితం చేసే దృష్టితో శృంగార రస కావ్యంగానే తీర్చి దిద్దాడు. వియోగ శృంగారాన్ని, సంభోగ శృంగారాన్ని కూడా ఈ లఘుకావ్యంలో చెప్పడం దీనికొక స్థాయిని కలిగించింది. మదన తాపం మనిషిని పరిపరి విధాలుగా ప్రవర్తించేటట్టు చేస్తుందంటూ-

‘తిష్ఠంత్యుచ్చలతి ప్రయాతి 

పునరప్యాయాతి సంభాషతే

తూష్ణీం భావముపైతి పశ్యతి 

దిశః సంమీలం త్యక్షిణీ

ఉద్భ్రామ్యత్యధికం దదాతి 

చధృతిం నిశ్చేష్టితే చేష్టతే

హాకష్టం మదనేన దారుణ 

తరం కిం కింనసా బాధతే’

అన్న శ్లోకం ద్వారా విరహాతురుల బాధల్ని వివరించి రసపుష్టి కలిగించిన తీరు కవి రసపోషణా దృష్టికి నిదర్శనం. ఈ కావ్యమే శృంగార కావ్యం. ఇందులోని ప్రతి శ్లోకమూ శృంగార రస పరిపూర్ణతకు తోడ్పడే రీతిలో కవి రచన సాగించాడు.

శృంగారం సర్వజీవ సహజమైన అంశం. శృంగార ప్రియత్వం మానసిక స్థితిలో పలు భావాలను ఉత్పన్నం చేస్తుంటుంది. ఆ విధమైన శృంగార ప్రేమికుల మానసిక భావోద్వేగ స్థితిని వర్ణిస్తూ-

‘అనిద్రా సమయం 

కథం కథమపి స్థిత్వార్థ రాత్రే వ్రజన్

నిశ్శబ్దం ప్రసదేవ మంద నిహిత 

శ్శాసః ప్రదీపాత్త్ర సన్

జిహ్ముకాంత పథః తృణాపి 

చరితే శంకోద ధానోన్యధా

ఛాయం స్యామపి వీక్ష్యవేపిత 

వపుః ప్రాప్తశ్శనైః చోరవత్’

అని అత్యంత సహజంగా చెప్పాడు. ఈ శ్లోకం శృంగార ప్రియుల మానసిక స్థితిని చదువరుల కళ్లకు కడుతుంది.

ఆలంకారిక ప్రతిభ

‘తామర పువ్వులో చిక్కుకొన్న తుమ్మెద వలె’, ‘కావ్య నాయిక ఫాలంపై నున్న అరుణ తిలకాన్ని’, ‘హోమగుండం మధ్యలో నున్న అగ్నిశిఖ వలె’, ‘ఆమె ముఖంపై నున్న స్వేద బిందువులను తామరపువ్వుపై నున్న ముండ్ల వలె’ అంటూ ఎన్నెన్నో ఆలంకారిక అభివ్యక్తుల్ని ఈ లఘు కావ్యంలో మనం గమనించవచ్చు. కవిలోని ఆలంకారిక ప్రతిభను మనం గుర్తించవచ్చు.

కావ్యం రాసింది రాళ్లపైనే, కాని వాటిని రసభరితం చేసిన మహోన్నత కావ్యం. అందుకే, ప్రసిద్ధ శాసన పరిశోధకులు డా. నేలటూరి వెంకట రమణయ్య, పి.వి. పరబ్రహ్మశాస్త్రి వంటి పెద్దలు ‘శాసన కావ్యాలలో ఇది ఉన్నతమైందని’ అభిప్రాయపడ్డారు. ఈ శాసనానికి సంబంధించిన విశేషాలను తెలిపిన డా. నాగయ్య వారన్నట్లు ‘ఓరుగల్లు శాసన చరిత్రలోనే ఇదొక మణిహారం’ అన్న మాట తిరుగులేని యదార్థం.

సాధారణ వృత్తాలకు భిన్నంగా..

ఇందులోని ఇతివృత్తం ఒక విధంగా కాళిదాసుని ‘మేఘ సందేశం’ కావ్యానికి సమీపంగా ఉంటుంది. సాధారణంగా సంస్కృత కావ్య మర్యాదను అనుసరించి కావ్యమంతా ఒకే ఛందస్సులో రచించడం మనం గమనిస్తుంటాం. అనుష్టుప్‌లో చాలా కావ్యాలు వచ్చాయి. కాళిదాసు ‘మేఘ సందేశం’ మాత్రం మందాక్రాంతంలో సాగింది. నృసింహర్షి కవి కూడా రాసింది సంస్కృత కావ్యమే కనుక సంస్కృత మర్యాదను అనుసరించి తన కావ్యంలోని 60 శ్లోకాలను కూడా ఒకే ఛందస్సైన శార్దూలాల్లో రచించాడు.

కేవలం చివరి రెండు మాత్రమే స్రగ్ధరలు రాశాడు. సాధారణ వృత్తాలకు భిన్నంగా స్రగ్ధర సాగుతుంది. స్రగ్ధర ఒక విశేష వృత్తం. నాలుగు పాదాలుండే ఈ వృత్తంలో ‘మహా అనే ఏడు గణాలు ఉంటాయి. అయితే, సంస్కృత శ్లోకాల్లో ప్రాస నియమం ఉండదు. యతి మాత్రం 8, 15వ అక్షరాలవద్ద చెల్లింపబడుతుంది.

తెలుగులో రచిస్తే అక్షర మైత్రి పాటిస్తుంటారు. సంస్కృతంలో ‘యతిర్విచ్ఛేద సంజ్ఞకము’ కనుక ఆ పద్ధతిలో సాగుతుంది. అన్ని శార్దూలాల తరువాత నృసింహర్షి రచించిన  “భోగానేవం ప్రకారాన్ ముహురనుభవతో హంతమేని ప్రయోగో..” అన్న స్రగ్ధర సంపూర్ణ లక్షణ సమన్వితంగా రచితమై, కవి ఛందః ప్రతిభను తెలుపుతూ ఉంది.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448