- * సెప్టెంబర్ నాటికి పీఎస్‌యూల స్థూల మొండి బకాయిలు 3 శాతం
* ప్రైవేటు బ్యాంక్‌ల ఎన్‌పీఏలు రూ.1.34 లక్షల కోట్లు (1.86 శాతం)
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఈ ఏడాది సెప్టెంబర్ 30నాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల నిరర్థక ఆస్తులు రూ.3.16 లక్షల కోట్ల మేర ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ల మొత్తం రుణాల్లో ఇవి 3.09 శాతం. ఇదే సమయానికి ప్రైవేటు రంగ బ్యాంక్‌ల వద్ద రూ.1.34 లక్షల కోట్ల స్థూల ఎన్‌పీఏలు ఉన్నాయి. ఇవి వాటి మొత్త లోన్‌బుక్‌లో 1.86 శాతం.
మంగళవారం రాజ్యసభకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి సమర్పించిన రిజర్వ్‌బ్యాంక్ ప్రాధమిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌నాటికి పీఎస్‌యూ బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు రూ.3,16,331 కోట్లు, ప్రైవేటు బ్యాంక్‌ల స్థూల ఎన్‌పీఏలు రూ.1,34,339 కోట్లు. అలాగే ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంక్రప్టసీ చట్టం (ఐబీసీ) కింద 2024 మార్చి 31నాటికి రూ.50 కోట్లకుపైబడి రుణ బకాయిలు ఉన్న 580 రుణగ్రస్తుల్ని (వ్యక్తులు, విదేశీ రుణగ్రస్తులు మినహా) ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు వర్గీకరించినట్లు మంత్రి తెలిపారు.
ఒక ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2024 సెప్టెంబర్ 30 నాటికి ఐబీసీ కింద 1,068 కార్పొరేట్ రుణ పరిష్కార ప్రణాళికలకు ఆమోదం లభించిందని, ఈ కేసుల్లో రుణదాతల (బ్యాంక్‌లు) క్లెయింల మొత్తం రూ.11.45 లక్షల కోట్లని, ఆస్తుల విక్రయ విలువ రూ.2.21 లక్షల కోట్లని వివరించారు.